- ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలతో మేలు: మంత్రి తుమ్మల
- సీజన్‌కు ముందే పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులు సిద్ధం
- కేంద్రం సహకరించకున్నా మక్కలు, వడ్లు కొనుగోలు చేస్తున్నామని వెల్లడి
- పంట అవశేషాలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
ఖమ్మం టౌన్, వెలుగు : వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పప్పుదినుసులు, నూనెగింజల సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది వానలు తక్కువగా పడతాయన్న సూచనలకు అనుగుణంగా వానాకాలం పంటల ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. జిల్లాలోని జలాశయాల్లో నీటినిల్వలు డెడ్ స్టోరేజీకి చేరినందువల్ల వాటిని తాగునీటి అవసరాల కోసమే వాడుకోవాలని నిర్ణయించామన్నారు. సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని, పచ్చి రొట్ట విత్తనాలను సబ్సిడీపై ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే రైతులకు మేలు జరుగుతుందని, ప్రభుత్వం మార్కెటింగ్ పరంగా సహకారం అందిస్తుందని చెప్పారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా కొనుగోళ్లు..
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే మక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌తో పాటు 65 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేశామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో ఏడు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయని, కల్లూరు ఫ్యాక్టరీ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందన్నారు. అయితే, విదేశీ పత్తి దిగుబడులు, ఆయిల్ పామ్ దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల పత్తి, ఆయిల్ పామ్ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువగా పురుగుమందులు వాడడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
రైతులు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ వ్యవసాయ పద్ధతులు పాటించాలని, నానో యూరియా వాడాలని పిలుపునిచ్చారు. రామగుండం ఎరువుల కర్మాగారం తరచూ ఉత్పత్తి నిలిపివేయడం వల్ల కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు అవగాహన కల్పించినా కొంతమంది రైతులు వరి కొయ్యలు, పంట అవశేషాలను కాలుస్తున్నారని, దీనివల్ల పంటలు, తోటలతోపాటు ప్రాణనష్టం కూడా సంభవించిందని మంత్రి గుర్తుచేశారు. పంట అవశేషాలను కాలిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. వచ్చే వారం నుంచే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు.
