కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర రైతాంగానికి అన్యాయం..ఇన్‌పుట్ ఖర్చులు తగ్గించే ఎలాంటి చర్యలు లేవు: తుమ్మల

కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర రైతాంగానికి అన్యాయం..ఇన్‌పుట్ ఖర్చులు తగ్గించే ఎలాంటి చర్యలు లేవు: తుమ్మల
  • మద్దతు ధరకు చట్టబద్ధ హక్కు కల్పించలేదు
  • ఇంపోర్ట్స్​కు అనుకూలంగా వ్యవహరిస్తోంది
  • మార్కెట్ భరోసా లేకుండా ఏఐతో రైతు సమస్యలు పరిష్కారం కావని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి, రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నిరాశ కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్ర రైతుల ఆశలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని, దేశీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించకుండా దిగుమతులకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంచకపోవడంతో రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందన్నారు.

పసుపు బోర్డుకు నిధులు కేటాయించకపోవడం, పసుపును హైవాల్యూ క్రాప్‌గా గుర్తించకపోవడం లక్షలాది పసుపు రైతులకు పెద్ద ఎదురుదెబ్బగా మారిందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా కొబ్బరి (కోకనట్) బోర్డు ఏర్పాటు విషయంలో బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన లేకపోవడం రాష్ట్ర రైతాంగానికి మరో దెబ్బగా మారిందని విమర్శించారు.

ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో రైతులపై మరింత భారం పడనుందని, ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించే దిశగా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని తుమ్మల తెలిపారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హక్కు కల్పించకపోవడం, వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపై స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం బడ్జెట్‌లోని ప్రధాన లోపాలని మంత్రి తుమ్మల అన్నారు.

రైతుల ఆదాయం పెంపు.. మాటలకే పరిమితమైంది

 నూనెల దిగుమతి డ్యూటీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దేశీయ నూనెగింజల రైతులను రక్షించలేకపోతోందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పథకాల ఏకీకరణ పేరుతో తెలంగాణకు వచ్చే నిధుల్లో కోత విధించడం రాష్ట్రానికి తీరని అన్యాయమని స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యం మాటలకే పరిమితమైందని, దానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదని మంత్రి విమర్శించారు.

బడ్జెట్‌లో వ్యవసాయ రంగంలో ప్రస్తావించదగిన ఏకైక అంశం ఏఐ ఆధారిత కార్యక్రమాలే కానీ, ధర భద్రత, మార్కెట్ భరోసా లేకుండా ఏఐ రైతు సమస్యలకు పరిష్కారం కాదని తుమ్మల అభిప్రాయపడ్డారు. మొత్తంగా కేంద్ర బడ్జెట్ రాష్ట్ర రైతాంగంలో ఆశలు నింపడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రానికి ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ లేకుండా రూపొందించారని మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు.