- జూన్ 2 లోగా నిధుల విడుదలకు హామీ
- మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుగా త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, భూసేకరణ స్పీడప్ చేయాలని అధికారులను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. 1.06 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే లక్ష్యంతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులతో పాటు న్యాయపరమైన చిక్కుల వల్ల పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. ప్రాజెక్టుపై సోమవారం సెక్రటేరియెట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన రివ్యూ చేశారు.
1.41 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించిన ఈ రిజర్వాయర్‌ను.. అదనపు ఆయకట్టు కోసం 8.23 టీఎంసీలకు పెంచి ప్రభుత్వం ముందు అంచనాలను పెట్టామన్నారు. రైతులకు భూసేకరణ పరిహారం న్యాయబద్ధంగా అందిస్తామని, నిధుల మంజూరుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. జూన్ 2 నాటికి ఆ నిధులను విడుదల చేస్తామని, భూసేకరణను సకాలంలో పూర్తి చేయాలని కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
ప్రాజెక్టుపై విచారణ మరో రెండ్రోజుల్లో ఉందని, దానిని అధిగమించేందుకు అవసరమైన వ్యూహంతో సిద్ధంగా ఉండాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించారు. భూసేకరణ వేగంగా పూర్తి చెయ్యాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన విధంగా దేవాదుల, గౌరవెల్లి సహా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలన్నారు.
