6 నెలల్లో 4 ప్రాజెక్టుల పర్మిషన్లు రావాలి..పీఆర్‌‌ఎల్‌‌ఐఎస్, సీతారామ, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి ఉత్తమ్

6 నెలల్లో 4 ప్రాజెక్టుల పర్మిషన్లు రావాలి..పీఆర్‌‌ఎల్‌‌ఐఎస్, సీతారామ, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి ఉత్తమ్
  • వారంలో నోడల్ ఆఫీసర్ల నియామకం.. 30 రోజుల్లో పర్యావరణ స్టడీ రిపోర్టులు పూర్తి చేయాలి
  • ఇంటర్‌‌ స్టేట్ వింగ్‌‌కు లీగల్, టెక్నికల్ స్ట్రెన్త్ పెంచి కేంద్రం, ఎన్జీటీ ముందు బలమైన 
  • వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పెండింగ్‌‌లో ఉన్న పర్యావరణ అనుమతులను ఆరు నెలల్లో తీసుకొచ్చేలా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యావరణ అనుమతుల ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన స్పష్టమైన తీర్పు నేపథ్యంలో సోమవారం సెక్రటేరియెట్‌‌లో  ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయక్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. గతంలో అనుమతులున్న ప్రాజెక్టుల రక్షణ, పెండింగ్ దరఖాస్తుల పునఃసమీక్ష, తిరస్కరణకు గురైన ప్రతిపాదనల సవరణలపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి ఏడు రోజుల్లో ప్రతి ప్రాజెక్టుకు నోడల్ అధికారులను నియమించి, అన్ని రికార్డులను సిద్ధం చెయ్యాలని ఉత్తమ్ ఆదేశించారు.

“30 రోజుల్లో పర్యావరణ అధ్యయనాలు, నివేదికలు, భూసేకరణ, పునరావాస పత్రాలను నవీకరించాలి. 60 రోజుల్లో పరిపాలనాపరమైన దరఖాస్తు ప్రక్రియను ముగించాలి. ఆరు నెలల్లో ప్రాజెక్టులవారీగా పర్యావరణ అనుమతులు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి. దీనిపై వారానికోసారి ప్రగతి నివేదికలు ఇస్తూ, నెలకు ఒకసారి ఉన్నత స్థాయిలో సమీక్షించాలి” అని అధికారులను ఆదేశించారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖతో పాటు ఇతర రాజ్యాంగబద్ధ సంస్థల వద్ద పెండింగ్‌‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పునరుద్ధరించేందుకు లీగల్, టెక్నికల్ బృందాలతో ఇంటర్-స్టేట్ వింగ్‌‌ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.

పోలవరం బ్యాక్‌‌వాటర్‌‌పై సైంటిఫిక్ అసెస్‌‌మెంట్

పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌‌వాటర్ వల్ల తెలంగాణ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా భూములు, మౌలిక వసతులు, నివాస ప్రాంతాలపై పడే ప్రభావంపై సైంటిఫిక్ స్టడీ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం గోదావరిపై పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేకముందే, తెలంగాణకు జరిగే ముంపు నష్టాన్ని పక్కాగా లెక్కించాలని స్పష్టం చేశారు.

ముంపు వల్ల కలిగే నష్టానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర సంస్థలపైనే ఉందని, తగిన ఆధారాలతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం ముందు తెలంగాణ తరఫున గట్టిగా క్లెయిమ్ చేయాలని సూచించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుల్లో ఉన్న కేసుల విచారణకు సంబంధించి రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర లీగల్ టీమ్ తరఫున హాజరవుతున్న అడ్వకేట్ శ్రవణ్ కుమార్ కేసుల స్థితిగతులను సమావేశంలో వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్టుల వారీగా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఉత్తమ్ సూచించారు.