- మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటయోధులు
- తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ పిచ్చెక్కి మాట్లాడుతుండు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- మరో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది
- బీఆర్ఎస్ 10 ఏళ్లలోనే చేయని అభివృద్ధి కాంగ్రెస్ 26 నెలల్లోనే చేసింది
మిర్యాలగూడ, వెలుగు: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులపై పోరాడుతూనే ఉంటామని, కాంగ్రెస్ సర్కార్‌లోనే కృష్ణా బేసిన్ ఆయకట్టులో రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రజాపాలన ప్రగతి బాట ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించినా వీరోచితంగా పోరాటం చేశారని మంత్రి కొనియాడారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 85 శాతం ప్రజలకు ఆరుకిలోల సన్నబియ్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తోందన్నారు.
బీఆర్ఎస్ పాలనలో నాణ్యతలేని దొడ్డు బియ్యం ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక నెల్లికల్ లిఫ్ట్, తోపుచర్ల, దున్నపోతుల లిఫ్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఏడాదిలోపు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. ఎన్‌ఎస్పీ మెయిన్ కాలువ పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తామన్నారు.
కేసీఆర్ పిచ్చెక్కి మాట్లాడుతుండు..
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అని కొనియాడారు. ఆసియాలోనే అత్యధిక రైస్ మిల్లులు ఉన్న మిర్యాలగూడ ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతూ అధిక నిధులు కేటాయించాలని కోరారు.
10 ఏండ్ల బీఆర్‌ఎస్ పాలనతో పోలిస్తే 26 నెలల కాంగ్రెస్ సర్కార్ పాలనలో ప్రజలకు ఎక్కువ లబ్ధి చేకూరిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డును ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రజాపాలనలో తెల్లరేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం ఇస్తున్నామన్నారు.
విద్యే అభివృద్ధికి పునాదని రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రానున్న 20 ఏండ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.
బహిరంగ సభకు 50 వేల మంది రాక
మిర్యాలగూడలో బుధవారం నిర్వహించిన భారీ సభకు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. సుమారు 50వేల మందికి పైగా సభకు వచ్చారని అధికారులు అంచనా వేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఈ సభకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు, ఎమ్మెల్సీలు కేతావత్‌శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, ఎంపీ రఘువీర్‌రెడ్డి, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, టూరిజం చైర్మన్ రమేశ్‌రెడ్డి, స్కైలాబ్‌నాయక్, పగిడి రామలింగం తదితరులున్నారు.
బదనాం చేసినా ప్రజాసేవకే అంకితం :ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఎంత బదనాం చేసినా కాంగ్రెస్ పార్టీకి, ప్రజాసేవకే తన జీవితం అంకితం అని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు నామినేషన్ వేయడంలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు.
బీఆర్ఎస్ నాయకుల బెదిరింపుల నుంచి ప్రజలను కాపాడేందుకే ఆ నిర్ణయం తీసుకున్నానన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 48 వార్డుల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, డంపింగ్ యార్డ్ తరలింపు, దామరచర్లలో 50 పడకల ఆసుపత్రి, వాడపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి, మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు సీఎం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
