రాహుల్​కు నాయకత్వ లక్షణాల్లేవు..ఏ హోదాలో హామీలిచ్చిండు

రాహుల్​కు నాయకత్వ లక్షణాల్లేవు..ఏ హోదాలో హామీలిచ్చిండు
  • బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది బీఆర్​ఎస్​ పార్టీనే : కేకే
  • రాహుల్​ను పప్పు అనడంలో తప్పేమీ లేదు: మంత్రి ప్రశాంత్​రెడ్డి
  • తెలంగాణ బరాబర్ కేసీఆర్ జాగీరే:  మంత్రి జగదీశ్​రెడ్డి
  • ఆయన ఏ హోదాలో హామీలిచ్చిండు: మంత్రి ప్రశాంత్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం సభలో రాహుల్​గాంధీ ఏ హోదాలో హామీలిచ్చారని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ప్రశ్నించారు. రాహుల్​ను పప్పు అంటే ఇన్నాళ్లు బాధ పడేవాడినని, ఖమ్మం సభలో ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే పప్పు అనడంలో తప్పేమి లేదనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఇక్కడి కాంగ్రెస్ ​సన్నాసులు రాసి చ్చిన స్క్రిప్ట్​నే​ఆయన చదివి వెళ్లిపోయారని అన్నారు. కాంగ్రెస్​లో ఏ పదవి లేకున్నా అన్నీ తానే అయి రాహుల్ పార్టీని నడిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. రాహుల్​ రిమోట్​గాంధీలా వ్యవహరిస్తున్నారని అన్నారు. సోమవారం బీఆర్ఎస్​ఎల్పీలో మంత్రి పువ్వాడ అజయ్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  కర్నాటకలో కాంగ్రెస్ ​మొన్ననే గెలిచిందని, అక్కడ రూ.4 వేల పింఛన్​ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు.  కేసీఆర్​ది రాచరికం కాదని, 88 సీట్లతో గెలిచి రెండోసారి సీఎం అయ్యారని చెప్పారు. కాంగ్రెస్​లో తానే రాజునని రాహుల్​అనుకుంటున్నారని ప్రశాంత్​రెడ్డి ఎద్దేవా చేశారు.

ఖమ్మంలో తొమ్మిది సీట్లు గెలుస్తం : పువ్వాడ 

భారత్​జోడో యాత్రతో రాహుల్​లో పరిపక్వత వచ్చిందని అనుకున్నానని, ఖమ్మం సభతో అది నిజం కాదని రాహుల్​ నిరూపించారని మంత్రి పువ్వాడ అజయ్ ​అన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి యూటర్న్​ తీసుకున్నది కాంగ్రెస్​ కాదా? అని ప్రశ్నించారు. ఖమ్మంలో ఈసారి పది అసెంబ్లీ సీట్లలో తొమ్మిది గెలుస్తామన్నారు. కాంగ్రెస్ ​పార్టీకి దమ్ముంటే రూ.4 వేల పింఛన్​దేశమంతా అమలు చేయాలన్నారు. ఖమ్మం సభలో దళిత నేత భట్టిని కాంగ్రెస్​నేతలు అవమానించారన్నారు. జాతరలకు కూడా జనం వస్తారని, ఖమ్మం సభకు వచ్చిన జనాన్ని చూసి కాంగ్రెస్​నేతలు జబ్బలు చరుచుకోవద్దని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. చిరంజీవి సభలకు కూడా జనం వచ్చారని, కానీ ఓట్లు మాత్రం వేయలేదన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ​ఎంఎస్ ప్రభాకర్​ రావు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, సండ్ర వెంకటవీరయ్య, జాజాల సురేందర్​ పాల్గొన్నారు.