నిరుపేద క్రైస్తవ సోదరులందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇంద్రవెల్లిలోని హోలీ ట్రినిటీ చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లోమంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇంద్రవెల్లిలో ఎంతో సేవాభావంతో ఈ చర్చిని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి వివేక్ కొనియాడారు.
మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్... ఈ బడ్జెట్‌లో మైనారిటీలకు భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. అయితే ఈ నిధులు సరిపోవని, రాబోయే రోజుల్లో నిధులను మరింత పెంచి మైనారిటీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిందని మంత్రి వివరించారు. ప్రభుత్వం తరపున క్రైస్తవ సోదరుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, అందుకోసం అవసరమైన ప్రత్యేక నిధులను కేటాయిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
సమాజంలో విషం చిమ్మే భావజాలాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అందరినీ కలుపుకుని పోయే తత్వమున్న పార్టీ అని గుర్తుచేశారు. ప్రజలందరిలో క్రైస్తవ మతం ప్రేమభావాన్ని పెంచుతోందని, ముఖ్యంగా క్రిస్టియన్ మతంలోని క్షమాగుణం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. క్రైస్తవ సంస్థలు సమాజంలో ప్రజలకు మంచి విలువలను నేర్పుతున్నాయని ప్రశంసించారు.
ఈ వేడుకల్లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తాను చిన్నప్పుడు సెయింట్ పాట్రిక్ స్కూల్‌లోనే చదువుకున్నానని, అందువల్ల తనకు క్రైస్తవ పద్ధతులు, వారి ప్రార్థనల పట్ల పూర్తి అవగాహన, గౌరవం ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పవిత్రమైన రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.ప్రస్తుత దేశ పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత అరవై సంవత్సరాలుగా మన దేశంలో ఎంతో గొప్పగా విలసిల్లిన మత సామరస్యం... ఈ మధ్య కాలంలో తగ్గుతూ వస్తోందని ఆందోళన చెందారు. కేవలం చిన్న చిన్న అపార్థాల కారణంగానే ప్రస్తుతం దేశంలో అక్కడక్కడా గొడవలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.
ఏ మతమైనా, ఏ కులమైనా... మనమంతా మొదటిగా భారతీయులమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ బలం అన్న ఆయన... మనకు వచ్చే సమస్యలను అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు. ప్రజలందరూ అపార్థాలను వీడి, ఐకమత్యంతో, సోదరభావంతో జీవించినప్పుడే దేశం మరింత ముందుకు వెళ్తుందని వంశీకృష్ణ స్పష్టం చేశారు.
