ప్రగతి ప్రణాళిక అమల్లో మెదక్‌ టాప్‌లో ఉండాలి.. అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి: మంత్రి వివేక్‌

ప్రగతి ప్రణాళిక అమల్లో మెదక్‌ టాప్‌లో ఉండాలి.. అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి: మంత్రి వివేక్‌
  • 6 గ్యారెంటీల అమలు, ఇందిరమ్మ ఇండ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి
  • సింగూర్​ ప్రాజెక్ట్​ రిపేర్ల నేపథ్యంలో తాగునీటికి సమస్య లేకుండా చూడాలి
  • ఈ కార్యక్రమం అమలుపై నెల తర్వాత రివ్యూ చేస్తానని వెల్లడి
  • కలెక్టర్లు, అధికారులతో ఉమ్మడి మెదక్​ జిల్లా సన్నాహక సమావేశం 
  • చెన్నూరులో 99 డేస్‌ యాక్షన్​ ప్లాన్ కార్యక్రమానికి హాజరు

మెదక్/కోల్‌బెల్ట్‌, వెలుగు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక అమలులో ఉమ్మడి మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే టాప్‌లో ఉంచేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి  వివేక్ వెంకటస్వామి సూచించారు.  అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాలవారికి మెరుగైన వసతులు, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నదని చెప్పారు. 99 డేస్‌ కార్యక్రమం అమలుపై శుక్రవారం మెదక్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అవసరాలు తెలుసుకోవాలని, వారికి అవసరమైన పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి నెల రోజుల తర్వాత ఆయా శాఖల పనితీరును సమీక్షిస్తామని చెప్పారు. ఆరు గ్యారెంటీల అమలు, ఇందిరమ్మ ఇండ్లపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. ఏప్రిల్​ తర్వాత రెండో విడత ఇండ్లు మంజూరవుతాయని, ఆలోగా మొదటి విడత ఇండ్ల నిర్మాణం పూర్తి చేయించాలని ఆదేశించారు. పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని, ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

త్వరలో పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభం

సిద్దిపేట జిల్లాలో నిర్మించిన పామాయిల్​ ఫ్యాక్టరీని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వివేక్‌ వెంకట స్వామి తెలిపారు. సింగూర్​ ప్రాజెక్ట్​ రిపేర్ల నేపథ్యంలో వేసవిలో ఎక్కడా తాగునీటికి సమస్య రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన అంచనాలు అందజేయాలని, కేబినెట్‌లో చర్చించి నిధులు మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు. సంగారెడ్డి నుంచి బీహెచ్ఈఎల్ రూట్‌లో ఎయిర్​పొల్యూషన్ సమస్యను పరిష్కరించేందుకు పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు చర్యలు తీసుకునేలా చూడాలని సంగారెడ్డి కలెక్టర్‌‌ను ఆదేశించారు.

గుమ్మడిదలలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కోసం స్థలం సేకరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, ట్రాన్స్​పోర్ట్​ డిపార్ట్​మెంట్లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలో టూరిజం డెవలప్​మెంట్‌పై దృష్టి పెట్టాలని, ఇద్దరు ఎంపీల సహకారంతో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక అమలు చేస్తున్నదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు వెల్లడించారు.​ 

సెల్ప్​ హెల్ప్​ గ్రూప్​ మహిళలకు డిజిటల్​ హెల్త్ కార్డులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం విప్లవాత్మకమని జహీరాబాద్ ఎంపీ సురేశ్‌ షెట్కార్ పేర్కొన్నారు.  అర్హులైన ప్రతిఒక్కరికీ రైతు బీమా అందేలా చూడాలని అగ్రికల్చర్​ ఆఫీసర్లకు సూచించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్ రావు, సంజీవ రెడ్డి, టీజీఐడీసీ చైరపర్సన్​ నిర్మల, మెదక్ మున్సిపల్​ చైర్​ పర్సన్​ రాధిక తదితరులు పాల్గొన్నారు.

 ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ వార్డుకు రూ.15 లక్షల నిధులు 

99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని  మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మూడో వార్డులో  ప్రజా పాలన –  ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయన  హాజరయ్యారు. ప్రజలతో అధికారులు  మమేకమై వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం   99 రోజుల యాక్షన్​ ప్లాన్ ఉద్దేశమని చెప్పారు.  మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో శానిటేషన్​ నిర్వహణపై ప్రత్యేక దృష్టి  సారించాలని సూచించారు. 

ప్రభుత్వ కార్యాలయాల్లో  పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయాలన్నారు.   నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి కోసం బోర్​వెల్స్​ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చెన్నూరు మున్సిపల్​ పరిధిలోని ప్రతీ వార్డులో అభివృద్ధి  పనులకు రూ.15 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం నిధులు అందిస్తున్నానని, ఆఫీసర్లు, కౌన్సిలర్లు సమస్యలను గుర్తించి  ప్రతిపాదనలు అందించాలని సూచించారు.  ఎన్నికల ముందు ప్రారంభించిన  పనులు కొనసాగుతున్నాయని, ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. 

ఏప్రిల్‌లో ఇందిరమ్మ ఇండ్లు..

అర్హత గల మహిళలకు ఏప్రిల్‌లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి వివేక్‌ తెలిపారు.  నగర అభివృద్ధి, డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధుల ద్వారా  చెన్నూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి మోడల్ టౌన్ గా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు.  చెన్నూరులో తుదిదశలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి..  త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.  

ఈ సందర్భంగా కలెక్టర్​కుమార్​దీపక్‌తో  కలిసి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ చేయించారు. చెన్నూరులో  రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న   మైనారిటీ ఫంక్షన్ హాల్‌కు  మంత్రి వివేక్‌  శంకుస్థాపన చేశారు. అనంతరం  ఇఫ్తార్ విందులో  పాల్గొన్నారు. చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్​ నాయకపు వినయ్ కుమార్, మూడో వార్డు కౌన్సిలర్ అంబటి శంకర్, అధికారులు, మైనార్టీ, కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.