ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొందాం.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: మంత్రి వివేక్

ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొందాం.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: మంత్రి వివేక్
  • ముందస్తు కార్యాచరణతో అధికారులు సిద్ధంగా ఉండాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించండి
  •     వర్షపు నీటి సంరక్షణ, నీటి పొదుపు చర్యలపై అవగాహన కల్పించండి 
  •     మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష

సంగారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో ఎల్-నినో వల్ల తలెత్తే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, ముందస్తు కార్యాచరణతో అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. సోమవారం సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో మెదక్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్-నినో ప్రభావంతో కలిగే నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించే దిశగా లోటు వర్షపాతం, నీటి కొరత, పంటలపై ప్రతికూల ప్రభావం వంటి అంశాలను అంచనా వేసి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్, 8 ఎకరాల కంది పంట సాగు చేయొచ్చని చెప్పారు. 

రైతులకు అవగాహన కల్పించండి..

పంటల మార్పిడిపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలని, రీల్స్, కళాజాతాలు తదితర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని మంత్రి వివేక్‌ సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు, అంతర్ పంటల సాగుపై రైతులు దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల ఇబ్బందిగా మారిన కోతుల బెడద నివారిస్తే రైతులు పంటల మార్పిడి చేసుకునేందుకు ముందుకు వస్తారని చెప్పారు. ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి వృథాను అరికట్టాలని, భూగర్భ జలాలను సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. బోర్‌వెల్‌ల రీచార్జ్‌, వర్షపు నీటి సంరక్షణ, నీటి పొదుపు వంటి చర్యలను అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల తాగునీటికి, పశువుల మేతకు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు.

ఎల్-నినో ఎఫెక్ట్‌ను ముందస్తుగా అంచనా వేసి ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటోందని ప్రత్యేక సీఎస్, ఉమ్మడి మెదక్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఎ.వాణి ప్రసాద్ అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ఉద్దేశమని పేర్కొన్నారు. అనంతరం ‘జలసిరి’ ప్రచార పోస్టర్, జిల్లా కంటింజెన్సీ ప్లాన్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. అంతకుముందు వివిధ శాఖల అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాల్లో తాజా పరిస్థితులను వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరెడ్డి, మాణిక్‌రావు, సునీతాలక్ష్మారెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు ప్రతీక్ జైన్, ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, వివిధ మున్సిపాలిటీల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.