ఆసిఫాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదని, తమ ప్రభుత్వం రెండున్నరేండ్లలో మూడున్నర లక్షల ఇండ్లు మంజూరు చేసి కట్టించిందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పల్లెల్లో పేదల సొంతింటి ఆశలు నెరవేర్చని బీఆర్ఎస్ సర్కార్‌ను ప్రజలు సాగనంపారని అన్నారు. ఆసిఫాబాద్‌జిల్లా కెరామెరిలో సోమవారం జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మంత్రి వివేక్ మాట్లాడారు.
గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణని మార్చేందుకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని తెలిపారు. కొత్త ఇండ్ల మంజూరు తో పాటు అర్హులకు కొత్తగా రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు మంజూరు చేసేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. కనీస వేతన చట్టం ద్వారా రాష్ట్రంలో పదేళ్లు ఇబ్బందిపడ్డ కార్మికులకి మేలు జరిగిందని అన్నారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం టామ్ కామ్ ద్వారా శిక్షణ ఎంతో మేలు చేస్తోందని విదేశాల్లో ఉద్యోగాలు యువతకు దక్కుతున్నాయని చెప్పారు. కొత్తగా గనుల ఏర్పాటు, సింగరేణిలో పది వేల ఉద్యోగాలు వస్తాయని, ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, పెన్షన్ అందిస్తామని తెలిపారు. అసంఘటిత కార్మికరంగ అభివృద్ధి కోసం కనీస వేతనాన్ని పెంచామని తెలిపారు. టామ్ కామ్ ద్వారా విదేశాలలో ఉపాధి కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు లక్ష ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించామని తెలిపారు.
పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నం: సీతక్క
పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, పేద ప్రజల అవసరాలు తీరుస్తూ సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీలకు కూడు, గుడ్డ, గూడు అందించి వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన పోడు రైతులకు పోడు భూముల పట్టాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదవాడి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న ఇండ్లను గుర్తించి పూర్తిచేసే విధంగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణ పరిస్థితిని బట్టి నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి నిర్వహణ సక్రమంగా చేపడుతూ, వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, గడ్డం వినోద్, హరిశ్ బాబు, వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ కె.హరిత, సర్పంచ్ లు శాంతాబాయి, వడై.శాంత తదితరులు పాల్గొన్నారు.
