సిద్దిపేట మున్సిపాలిటీని  గెలుచుకుంటం.. కాంగ్రెస్ నేతల సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి

సిద్దిపేట మున్సిపాలిటీని  గెలుచుకుంటం.. కాంగ్రెస్ నేతల సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి
  •    సోషల్ మీడియాలో హరీశ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు
  •     వివేక్ అన్న మీద ఒట్టు.. సిద్దిపేటలో హరీశ్ ను గద్దె దించుతం: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న సిద్దిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం గాంధీ భవన్ లోని ఇందిరా భవన్ లో సిద్దిపేట ప్రాంత కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వివేక్ వెంకటస్వామి ముఖ్య​అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వివేక్ మాట్లాడుతూ.. సిద్దిపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ను, హరీశ్ ను ఓడించేందుకు ఇప్పటి నుంచే పాత.. కొత్త నేతలు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఇక్కడ పక్కా గెలుస్తామనే నమ్మకం ఉన్నా.. ఏ ఒక్క వార్డును చేజార్చుకోకుండా అన్ని వార్డుల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడే అసలైన గెలుపుకు అర్థం ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా హరీశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటికప్పుడు బీఆర్‌‌‌‌ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను చూసుకునే బాధ్యత నాది అని వివేక్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీని గెలవాలని పార్టీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారని, ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ గెలిచి చూపించాలని వివేక్ కార్యకర్తలను కోరారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గును అమ్ముకున్నారని హరీశ్ రావు అబద్ధాలు చెప్తున్నాడని, బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో కేవలం వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 4 వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మరి ఇంత ఆదాయం వచ్చినప్పుడు బొగ్గు ఎలా అమ్ముకుంటామని వివేక్ ప్రశ్నించారు.

మన టార్గెట్​ కేటీఆర్, హరీశ్

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. ‘‘మంత్రి వివేక్ అన్న మీద ఒట్టేసి చెబుతున్న.. సిద్దిపేటలో హరీశ్ రావును గద్దె దించుతాం. సిద్దిపేటలో బుల్లెట్ దిగాలి, మన టార్గెట్ కేటీఆర్, హరీశ్ మాత్రమేనని, వారి దుకాణాలను మూతేయాలి. కేసీఆర్ రిటైర్మెంట్ దశలో ఉన్నారు. మనకు పెయిడ్ లేబర్ అవసరం లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా పెయిడ్ లేబర్. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం.. సిద్దిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురేద్దాం’’ అని మైనంపల్లి పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.