భాగ్యరెడ్డి వర్మ జయంతికి.. మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా

భాగ్యరెడ్డి వర్మ జయంతికి.. మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా
  • రవీంద్రభారతిలో దళిత సంఘాల నిరసన
  • భాగ్యరెడ్డి వర్మను ప్రభుత్వం అవమానించిందని ఫైర్
  • జూలూరు గౌరీశంకర్ స్పీచ్​ను అడ్డుకున్న లీడర్లు
  • దళితులకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్
  • స్పీచ్ మధ్యలోనే ఆపేసిన గౌరీశంకర్
  • భాగ్యరెడ్డి వర్మ జయంతికి..మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా

బషీర్ బాగ్/హైదరాబాద్, వెలుగు: దళిత మహిళలు, స్టూడెంట్స్ అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన భాగ్య రెడ్డి వర్మ 135వ జయంతి వేడుకలను రవీంద్ర భార తిలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించాయి. అధికారికంగా నిర్వహించిన ఈ ప్రోగ్రామ్​కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరుకాలేదు. దీంతో దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. భాగ్యరెడ్డి వర్మ పేరుతో ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాక పోవడం ఆయన్ని అవమానపర్చడమేనని మండిపడ్డారు. ఇది భాగ్యరెడ్డి జయంతి సభ కాదని.. ఆత్మఘోష సభగా నిర్వహించారని పలువురు లీడర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​గా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతుండగా దళిత సంఘాల లీడర్లు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్​ను పొగుడుతూ మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్వాహకులు కలగజేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకుండా కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు వేదికపై స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పొగడ్తలతో ముంచెత్తడం ఏంటి?

సీఎం​ను పొగడ్తలతో ముంచెత్తడం కాదని, దళితుల కోసం ఆయన ఏం చేశారో చెప్పాలని గౌరీశంకర్​ను ప్రశ్నించారు. భాగ్యరెడ్డి జయంతికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని నిలదీశారు. ప్రభుత్వ వైఖరి దళితులను అవమానపర్చడమేనని మండిపడ్డారు. నిరసనకారులు ఎంతకీ వినకపోవడంతో చేసేదేమీ లేక గౌరీశంకర్ తన స్పీచ్ మధ్యలోనే ఆపేశారు. దళితుల అభ్యున్నతి కోసం, జోగిని, దేవదాసి వ్యవస్థలను రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్​ సాయిచంద్ అన్నారు. హిందూ మత సంస్కరణ కోసం ఆయన చేసిన కృషికి గాను ఆర్య సమాజం ‘వర్మ’ అనే బిరుదును అందించారని గుర్తు చేశారు.