వరిపై మంత్రులు, అధికారుల విభిన్న ప్రకటనలు

వరిపై మంత్రులు, అధికారుల విభిన్న ప్రకటనలు

వరిపై మంత్రులు,అధికారులు ఎవరికి వారు విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. రైతులంతా బ్రహ్మండంగా వడ్లు వేసుకొవచ్చన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. యాసంగి వడ్లే కొనబోమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కావాలనే బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. వరి విత్తనాలు అమ్మితే షాపులు క్లోజ్ చేస్తామని..సుప్రీం కోర్టు ఆర్డర్ వచ్చినా లెక్కచేయనని సిద్దిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే..

యాసంగిలో వరిధాన్యం కొనుగోలుచేసే పరిస్థితి లేదన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.. ప్రత్యామ్నాయపంటలపై రైతులు దృష్టిపెట్టాలన్నారు.. వరిసాగు-ప్రత్యామ్నాయ పంటలు, వడ్ల కొనుగోలుపై మంత్రి సమీక్ష నిర్వహించారు, దేశంలో నూనెగింజల కొరత ఉంది కాబట్టీ.. రైతులు వాటిని సాగుచేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు కూడా అధికంగా వరిని పండించడం వల్లే కేంద్రం చేతులెత్తేసిందని తెలిపారు. ప్రత్యామ్నాయ విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రిజగదీశ్ రెడ్డి.

రైతులు హైబ్రిడ్ లేదా సూటి రకాల వరి విత్తనోత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు కరీంనగర్ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్. సీడ్ ప్రొడక్షన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని రైస్ మిల్లర్లు సన్నరకం ధాన్యం కొనుగోలుకు అంగీకరించినందున.. రైతులు సన్నాలు వేసుకోవచ్చన్నారు. ఇక ప్రైవేటు విత్తన కంపెనీలు, సీడ్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకున్న రైతులు వరి విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు. నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలల్లో వరి పంటను సాగు చేసుకోవాలన్నారు. సర్కారు యాసంగి ధాన్యం కొనేదిలేదని చెప్పకుండా.. ప్రైవేటు విత్తన కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులే సాన్నాలు సాగు చేయాలన్నారు కరీంనగర్ కలెక్టర్. మిల్లర్లు కొంటామని చెప్పినందున.. సన్న రకం సాగు చేయొచ్చని చెప్పారు కర్ణన్.