ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్

ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్

బెంగళూరు/ న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని మోదీ ప్రసంగాలు చూస్తుంటే ఆయన చాలా భయాందోళనగా ఉన్నట్లు కనిపిస్తున్నదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రానున్న రోజుల్లో వేదికలపైనే ఆయన ఏడ్చినా ఏడ్వొచ్చని ఎద్దేవా చేశారు. శుక్రవారం కర్నాటకలోని విజయపురలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో   రాహుల్ మాట్లాడారు. " లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదని మోదీ ప్రధాని భయపడుతున్నారు. త్వరలో  సభా వేదికలపైనే ఆయన ఏడ్చినా ఏడ్వొచ్చు. బీజేపీ ప్రభుత్వం కొందరిని మాత్రమే కోటీశ్వరులను చేసింది.  కాంగ్రెస్ వస్తే కోట్లాది మందిని లక్షాధికారులను చేస్తుంది. పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని ప్రధాన మంత్రి మళ్లిస్తున్నారు.

మోదీ గత 10 ఏండ్లల్లో  పేదల డబ్బు దోచుకున్నారు. 70 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సంపద.. కేవలం 22 మంది వద్దే ఉంది. దేశంలోని 40% సంపద ఒక శాతం మంది వద్దే ఉంది. బిలియనీర్లకు మోదీ ఇచ్చిన డబ్బును పేదలకు అందజేస్తం. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రధాని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఎంపీలే ప్రకటిస్తున్నారు. కానీ, రాజ్యాంగాన్ని, సంఘ సంస్కర్తల ఆశయాలను  రక్షించడానికి కాంగ్రెస్, ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయి. గత దశాబ్దకాలంలో దేశంలో 20 నుంచి-25 మందిని మాత్రమే బిలియనీర్లుగా మార్చేందుకు మోదీ సహకరించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రక్షణ ప్రాజెక్టులు, సోలార్ ప్రాజెక్టులు వంటి వాటిని గౌతమ్ అదానీ వంటి వారికే అప్పగించారు. న్యాయ్ పథకాల అమలుతో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మందిని లక్షాధికారులుగా మార్చబోతోంది" అని రాహుల్ పేర్కొన్నారు.

 నిరుద్యోగం కరోనాలా వ్యాపించింది

విజయపురలో ప్రచారం అనంతరం రాహుల్ బళ్లారి చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం కరోనాలా వ్యాపించిందని విమర్శించారు. కరోనా సమయంలో చప్పట్లు కొట్టమని ప్రజలను కోరిన మోదీ.. ఇప్పుడు యువతను పకోడాలు (వడలు) అమ్ముకొని బతకాలంటూ సూచిస్తున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో కార్పొరేట్ కంపెనీలకు చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఇది 25 ఏండ్ల ఉపాధి హామీ పనులకు ఇచ్చే వేతనాలకు సమానమని రాహుల్ గాంధీ చెప్పారు.

ఎలక్షన్​ కమిషన్​ తోలుబొమ్మలా మారింది: కపిల్ సిబల్

ఎలక్షన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా తోలుబొమ్మలా మారిందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. మోదీ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మోదీకి బదులు జేపీ నడ్డాకు నోటీసులు పంపడంపై  అభ్యంతరం చెప్పారు. ఇది నిస్సహాయ చర్య అని ఆయన మండిపడ్డారు. ఏప్రిల్ 21న రాజస్థాన్​లో మోదీ మాట్లాడుతూ.. ప్రజల సంపదను ముస్లింలకు పంచాలని కాంగ్రెస్‌‌ భావిస్తోందని ఆరోపించారు. దీంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఆయనపై చర్యలకు డిమాండ్​ చేశాయి. దీనిపై ఈసీ స్పందిస్తూ.. వివరణ ఇవ్వాలంటూ బీజేపీ చీఫ్​కు నోటీసులు పంపింది.