వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించడం కుదరదు : సుప్రీంకోర్టు

వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించడం కుదరదు : సుప్రీంకోర్టు
  • కౌంటింగ్​లో100% ఓట్ల క్రాస్ వెరిఫికేషన్ అసాధ్యం: సుప్రీంకోర్టు  
  • వీవీప్యాట్​లపై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత 
  • మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానం తేవాలన్న అభ్యర్థనకూ నో 
  • ఈవీఎంలపై అనవసర అనుమానాలొద్దని కామెంట్ 
  • సింబల్ లోడింగ్ యూనిట్ ను 45 రోజులు భద్రపర్చాలి
  • వీవీప్యాట్ స్లిప్పులను మెషీన్ లతో లెక్కించాలని ఈసీకి సూచనలు  

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రాసెస్ లో ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పులను అన్నింటినీ కౌంట్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లలో నమోదైన ఓట్లతో ఓటర్ వెరిఫైయేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్)లలోని స్లిప్పులను వందకు వంద శాతం సరిపోల్చి చూడాలన్న అభ్యర్థనలను తోసిపుచ్చింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 

‘‘వీవీప్యాట్ స్లిప్పులను వంద శాతం లెక్కించాలన్న అంశంపై మేం విస్తృతంగా చర్చించాం. అన్ని ప్రొటోకాల్స్, టెక్నికల్ అంశాలనూ పరిశీలించాం. దీనిపై దాఖలైన అన్ని పిటిషనన్లనూ తిరస్కరించాం. ఒక వ్యవస్థపై గుడ్డిగా అపనమ్మకం ఏర్పర్చుకుంటే అనవసర అనుమానాలకు దారి తీస్తుంది” అని తీర్పు సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన బెంచ్ కామెంట్ చేసింది. ఈవీఎంలను రద్దు చేసి, పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలంటూ ఏడీఆర్​ సంస్థతోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను కూడా బెంచ్ తిరస్కరించింది.

ఈవీఎం విధానమే మేలు..  

ఎన్నికల నిర్వహణకు పేపర్ బ్యాలెట్ పద్ధతి కంటే ఈవీఎం విధానమే మేలు అని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈవీఎంల సామర్థ్యం, విశ్వసనీయతపై ఎలాంటి అనుమానాలూ లేవని, అనవసర అపనమ్మకాలతో అనుమానాలు వద్దని తేల్చిచెప్పింది. ‘‘ఎన్నికల్లో ఈవీఎంల వాడకంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో బోగస్ ఓట్లు, కౌంటింగ్ ప్రధాన సమస్యలుగా ఉండేవి. ఈవీఎంలతో ఈ సమస్యలు పోయాయి. కౌంటింగ్ సమయంలో వివాదాలు తగ్గిపోయాయి. అలాగే పేపర్ వాడకం తగ్గడంతోపాటు ఎన్నికల నిర్వహణ సులభతరం అయింది” అని కోర్టు వివరించింది. 

 ఈసీకి సూచనలు..

ఈవీఎంలలోకి సింబల్స్​ను లోడింగ్ చేసిన తర్వాత సింబల్ లోడింగ్ యూనిట్(ఎస్ఎల్ యూ)లను సీల్ చేసి, రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత కనీసం 45 రోజుల పాటు స్టోర్ రూంలో భద్రపర్చాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో జూన్ 1న ఫైనల్ ఫేజ్ పోలింగ్ ముగిసిన తర్వాత దీనిని అమలు చేయాలని తెలిపింది. ఎస్ఎల్ యూ స్టోరేజ్ కంటైనర్లను తప్పనిసరిగా సీల్ చేయాలని, వాటిపై అభ్యర్థుల సంతకాలు చేయించాలని ఆదేశించింది. 

అలాగే రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత అభ్యర్థులు ఎవరైనా విజ్ఞప్తి చేస్తే.. ఈవీఎం మైక్రోకంట్రోలర్ లో వినియోగించిన (బర్న్ చేసిన) మెమరీని తప్పనిసరిగా ఇంజనీర్ల బృందం చెక్ చేయాలని తెలిపింది. అయితే, ఈవీఎం మైక్రోకంట్రోలర్ మెమరీని చెక్ చేయాలంటే.. ఫస్ట్, సెకండ్ ప్లేస్ లలో వచ్చిన అభ్యర్థులు మాత్రమే అది కూడా ఫలితాలు వెలువడిన 7 రోజుల్లోపు మాత్రమే విజ్ఞప్తి చేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు అయ్యే ఖర్చును సంబంధిత అభ్యర్థే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే.. అభ్యర్థి చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని వివరించింది. అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్ గా 5 ఈవీఎంలను సెలక్ట్ చేసుకుని, వాటిలోని వీవీప్యాట్ స్లిప్పులను మాత్రమే ప్రస్తుతం కౌంట్ చేస్తున్నారు. ఇకపై వీవీప్యాట్ స్లిప్పులను కౌంట్ చేసేందుకు మెషీన్ లను వినియోగించే అంశాన్ని పరిశీలించాలని కూడా ఈసీకి కోర్టు సూచించింది.