ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు చెంపపెట్టు: మోదీ

ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు చెంపపెట్టు: మోదీ
  • ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం: ప్రధాని మోదీ
  • దేశ ప్రజలకు విపక్షాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్​
  • బిహార్​లోని అరారియా, ముంగేర్​లో ఎన్నికల ర్యాలీ

అరారియా (బిహార్​): ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మెషీన్​ (ఈవీఎం)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విపక్షాలకు చెంపపెట్టులాంటిదని ప్రధాని మోదీ అన్నారు. ఈవీఎంలపై అపవాదు మోపి వారు పాపం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. బిహార్​లోని అరారియా, ముంగేర్​లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. తమ అభిమాన ముస్లింల ఓట్లకోసం విపక్షాలు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. ‘కాంగ్రెస్​, ఆర్జేడీ, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పేదలు, వెనుకబడిన వర్గాల వారు, దళితుల ఓట్లను బూత్ క్యాప్చర్​ ద్వారా కోల్పోయేలా చేసేవా రు. ఈవీఎంలు వచ్చిన తర్వాత వాళ్ల ఆటలు సాగట్లేదు. అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ‘కానీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం విపక్షాల చెంప చెళ్లుమనిపించేలా తీర్పుచెప్పింది’  అని అన్నారు.

ఓబీసీ రిజర్వేషన్లను దోచుకుంటున్నారు

ఓబీసీల రిజర్వేషన్లను కాంగ్రెస్​ దోచుకుంటోందని, ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటకలో ఓబీసీలకు అందాల్సిన ప్రయోజనాలను ముస్లింలకు బదిలీ చేస్తున్నదని మోదీ ఆరోపించారు. బిహార్​సహా దేశంలో కాంగ్రెస్​ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇదే కుట్రను అమలుచేయాలని చూస్తున్నదన్నారు. దక్షిణాదిలో జరుగుతున్న ఈ కుట్రకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మిత్రపక్షమైన ఆర్జేడీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. ఓబీసీ బిడ్డగా.. వారి కష్టాలు తనకు తెలుసునని, భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను కూడా కొల్లగొడతారని తెలిపారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను మళ్లించడాన్ని తాను అంగీకరించబోనని, ఇది మోదీ గ్యారెంటీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్​ మేనిఫెస్టోపై ముస్లింలీగ్​ ముద్ర ఉన్నదని పునురుద్ఘాటించారు. ‘దేశ వనరులపై హక్కు పేద ప్రజలకే ఉన్నదని నేను చెబుతున్నా. ఆర్జేడీ, వారి మిత్రపక్షాలు పేదలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయి. మీ సందను, మంగళసూత్రాలను కూడా వారు దోచుకోవాలని చూస్తున్నారు’ అని మోదీ ఆరోపించారు.