దేశ రాజధానిలో ముదిరిన గ్యాస్ కష్టాలు.. బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ రేటు రూ.5వేలు..!

దేశ రాజధానిలో ముదిరిన గ్యాస్ కష్టాలు.. బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ రేటు రూ.5వేలు..!

ఇరాన్ యుద్ధం కాస్తా ఇప్పుడు భారదేశంలోని సామాన్యుల వంటగదిలోకి చొరబడింది. గ్యాస్ షార్టేజీతో కనీసం వంట చేసుకునేందుకు కూడా ఇబ్బందులు ఒకపక్క అయితే.. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి వంటనూనెల ధరలు పెరగటం మరోపక్కన ఆర్థికంగా కుంగదీస్తోంది. మోడీ సర్కార్ మాత్రం ఆల్ అండర్ కంట్రోల్.. ఏం ఫికర్ వద్దు కావాల్సినంత గ్యాస్ సిద్ధంగా ఉందంటూ ఊదరగొడుతోంది. అయితే వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వం చెబుతున్నదానికి పూర్తిగా భిన్నంగా ఉంది. 

దేశరాజధాని ఢిల్లీలోని హోటళ్లు, రెస్టారెంట్లపై గ్యాస్ కష్టాలు పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా దాదాపుగా నిలిచిపోయే పరిస్థితికి చేరింది. దీనివల్ల దేశ రాజధానిలో కనీసం 12 ప్రముఖ ఈటరీ కేంద్రాలు బుధవారం తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. నిత్యం కిటకిటలాడే రెస్టారెంట్లు ఇప్పుడు గ్యాస్ లేక వెలవెలబోతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి ఇతర మహానగరాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. వండటానికి గ్యాస్ లేక చాలా చోట్ల హోటళ్లు క్లోజ్ చేస్తున్నారు యజమానులు. 

ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. సాధారణ రేటు కంటే భారీగా డిమాండ్ చేస్తూ.. ఒక్కో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను రూ.5వేల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. గ్యాన్ అనే రెస్టారెంట్ యజమాని గగన్‌దీప్ సింగ్ సప్రా సోషల్ మీడియా వేదికగా ఈ అక్రమాలను బయటపెట్టారు. సిలిండర్ల సరఫరా లేనప్పుడు బ్లాక్ మార్కెట్లోకి ఇవి ఎలా వస్తున్నాయి? దీని వెనుక ఉన్న అధికారులు లేదా రాజకీయ నాయకులు ఎవరు? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇంత మెుత్తం చెల్లించలేక తాము కిచెన్స్ క్లోజ్ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా భావించే పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాపై కూడా ఆంక్షలు విధించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం.. వాణిజ్య వినియోగదారులకు గత ఆరు నెలల సగటు వినియోగంలో కేవలం 80 శాతం మాత్రమే సరఫరా చేయనున్నట్లు చెప్పింది కంపెనీ. మార్చి 11 నుంచే ఈ నిర్ణయం అమలులోకి రావడంతో వసంత్ కుంజ్ వంటి ప్రాంతాల్లోని మాల్స్‌లో ఉన్న ఫుడ్ కోర్టులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

రెస్టారెంట్ యజమానులు ఇప్పుడు గ్యాస్‌కు బదులుగా విద్యుత్ ఆధారిత ఇండక్షన్ వంట పరికరాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అందరికీ ఇది తక్షణమే సాధ్యం కాకపోవడంతో పహర్‌గంజ్ లాంటి ప్రాంతాల్లోని చిన్న చిన్న హోటళ్లు మూతపడ్డాయి. చివరకు ఢిల్లీ హైకోర్టులోని లాయర్ల క్యాంటీన్ కూడా గ్యాస్ కొరత వల్ల మధ్యాహ్న భోజన మెనూను నిలిపివేయాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని, గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని వ్యాపారులు కోరుతున్నారు. సాక్షాత్యూ దేశరాజధాని నగరంలోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ఇక మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు బ్లాక్ మార్కెటింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.