జగిత్యాల టౌన్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన--ప్రగతి ప్రణాళిక’ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా గుర్తించిన పది అంశాలపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
2027లో గోదావరి పుష్కరాల నిర్వహణ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, కె.సంజయ్, తదితరులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరస్వామి ఆలయ భూములు కాపాడండి మంత్రికి ఎమ్మెల్యే సంజయ్ వినతి
కోరుట్ల,వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్లలోని వేంకటేశ్వర స్వామి దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌ను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కోరారు. బుధవారం వారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్లలోని సర్వే నంబర్ 1497లో సుమారు 3.17 ఎకరాల్లో ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎండోమెంట్స్ పరిధిలో ఉందని, ఈ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ , ఎండోమెంట్ అధికారులతో సర్వే చేయించి, సరిహద్దులను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మెట్‌పల్లిలోని ఎంపీడీవో ఆఫీస్‌లో పలువురికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
