ఒమన్‌లోని సలాలా ఓడరేవుపై ఇరాన్ డ్రోన్ అటాక్స్.. భారీగా చెలరేగిన మంటలు

ఒమన్‌లోని సలాలా ఓడరేవుపై ఇరాన్ డ్రోన్ అటాక్స్.. భారీగా చెలరేగిన మంటలు

టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు అంతే స్థాయిలో ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా మిత్ర దేశమైన ఒమన్‎పై తాజాగా ఇరాన్ అటాక్ చేసింది. ఒమన్‌లోని సలాలా ఓడరేవు లక్ష్యంగా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. పోర్టులోని చమురు నిల్వ ట్యాంకులను ఇరాన్ డ్రోన్లు ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. 

దట్టమైన పొగ అలుముకుంది. ఈ దాడులను ఒమన్ టీవీ, బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ధృవీకరించాయి. అయితే.. ఈ దాడిలో వ్యాపార నౌకలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఇరాన్ డ్రోన్లు పోర్టుపై దాడి చేయడం, ఆ వెంటనే ఆకాశనంటేలా మంటలు చెలరేగిన దృశ్యాలు ఆన్ లైన్లో వైరల్‎గా మారాయి. 

ఒమన్ సుల్తాన్ సీరియస్:

సలాలా ఓడరేవుపై ఇరాన్ దాడులను ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సైద్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు జరిగిన వెంటనే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌ను సంప్రదించి ఒమన్ భూభాగంలో జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళనలను తెలియజేశారు. మిడిల్ ఈస్ట్ వార్‎లో ఒమన్ తటస్థ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు.

 ఒమన్ సార్వభౌమాధికారం, భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయతొల్లా ఖమేనీ వారసుడిగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయినందుకు మోజ్తాబా ఖమేనీని ఒమన్ సుల్తాన్ అభినందించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.