
- ఈ కేసులో ఎవ్వరినీ వదిలిపెట్టం: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- ప్రభాకర్‌రావుపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసును డైల్యూట్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఆయన ఇక్కడ ఉంటే ఇప్పటికే చర్యలు తీసుకునేవాళ్లమన్నారు. ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేశామని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ సీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశామనేది అవాస్తవమని, రెడ్ కార్నర్ నోటీసులు తమ పరిధిలోకి రావని ఇమ్మిగ్రేషన్, ఇంటర్‌పోల్ ప్రొసీజర్‌తో మాత్రమే సాధ్యమని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ముగ్గురి నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత..
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం కలిగించే అవకాశం ఉందన్నారు. ప్రాసిక్యూషన్ తరుఫు వాదనలతో జడ్జి ఏకీభవించారు. ప్రణీత్ రావు, భుజంగ రావు, తిరుపతన్న పిటిషన్స్‌ను కొట్టివేశారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.