- ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- కేంద్ర నిధులే లక్ష్యంగా 2026–27 బడ్జెట్..రూ. 15 వేల కోట్ల వడ్డీలేని రుణాలు రాబట్టుకునేలా ప్రణాళిక
- ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ ఆర్, మెట్రో, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు
- యంగ్ ఇండియా స్కూళ్లు, మెడికల్ కాలేజీలకు కూడా
హైదరాబాద్, వెలుగు: ఈనెలలో ప్రవేశపెట్టబోయే 2026–27 రాష్ట్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌కు అత్యధిక నిధులు కేటాయించేలా ఆయా శాఖల నుంచి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా ఇరిగేషన్, ట్రాన్స్‌పోర్ట్, పట్టణాభివృద్ధి, ఎనర్జీ, ఆర్ అండ్ బీ రంగాలకు ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా పెరగనున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2026–27 కేంద్ర బడ్జెట్ నుంచి మౌలిక వసతుల కింద అత్యధిక నిధులు, వడ్డీ లేని రుణాలు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పక్కాగా అడుగులు వేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వివిధ పద్దుల కింద రాష్ట్రానికి నిధులు తెచ్చుకునేలా ఇక్కడ బడ్జెట్ రూపకల్పన ఉండాలని యంత్రాంగానికి సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లు, రహదారుల విస్తరణ, ఎక్స్‌ప్రెస్ వేలు, మెట్రో పనులపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే, ఏండ్లనుంచీ అసంపూర్తిగా ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో స్మార్ట్ సిటీ పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయనున్నారు.
రూ. 15 వేల కోట్ల వడ్డీలేని రుణాలపై గురి!
మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌లో ఏకంగా రూ.12.2 లక్షల కోట్ల భారీ మూలధన వ్యయాన్ని కేటాయించింది. ఇందులో భాగంగా రాష్ట్రాల్లో స్థానిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు వడ్డీలేని 50 ఏండ్ల దీర్ఘకాలిక రుణాల కింద రూ.1.50 లక్షల కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేకంగా మంజూరు చేసింది. ఈ బృహత్తర స్కీమ్ కింద జనాభా, ప్రాజెక్టుల పురోగతి ప్రాతిపదికన మన రాష్ట్రం కనీసం రూ.15 వేల కోట్ల వరకు నేరుగా ఈ వడ్డీ లేని రుణాలను తీసుకునే అవకాశం ఏర్పడింది.
వీటికి అదనంగా జాతీయ రహదారుల నిధి, అమృత్, స్మార్ట్ సిటీస్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లాంటి కేంద్ర ప్రాయోజిత పట్టణాభివృద్ధి మిషన్ల ద్వారా మరో రూ.5 వేల కోట్లు సైతం రాష్ట్రానికి రాబట్టుకోవచ్చు. ఈ క్రమంలోనే కేంద్రం ప్రకటించిన వివిధ మౌలిక సదుపాయాల పద్దుల కింద రాష్ట్రానికి నిధులు తెచ్చుకునేలా, దానికి తగ్గ మ్యాచింగ్ వాటాను మన బడ్జెట్‌లో ముందుగానే చూపించనున్నారు.
విద్యుత్ సంస్కరణలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసే రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే రవాణా, లాజిస్టిక్స్, రైల్వే అనుసంధాన ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ వ్యయాన్ని భరిస్తే, నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించే పీఎం గతిశక్తి నిధుల నుంచి సైతం రాష్ట్రం లబ్ధి పొందనున్నది. కేంద్ర బడ్జెట్‌లో మౌలిక వసతులకు ఇచ్చిన ప్రాధాన్యతను సొమ్ము చేసుకునేలా, ఏ ఒక్క ఆర్థిక అవకాశాన్నీ వదులుకోకుండా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన పక్కాగా ఉండాలని సీఎం ఆదేశించారు.
పెండింగ్ ప్రాజెక్టులకు ఊతం
గడిచిన 10 ఏండ్లలో వేల కోట్లు ఖర్చు చేసినా పూర్తికాని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసేలా ఇరిగేషన్ శాఖకు బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులను ముందుగా గుర్తించి, వాటికి తక్షణమే నిధులను విడుదల చేసేలా ఒక ప్రాధాన్యతా క్రమాన్ని సర్కారు పక్కాగా నిర్ణయించింది.
ప్రాజెక్టుల నిర్వహణ, కాల్వల మరమ్మతులకు సైతం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించి రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. భౌతిక మౌలిక సదుపాయాలతో పాటే సామాజిక మౌలిక వసతుల కల్పన కింద విద్యా రంగానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరగనున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమైన వేలాది కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ ద్వారానే సమకూర్చనున్నారు.
ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక పద్దు.. ట్రిపుల్ ఆర్‌కు ప్రాధాన్యం
ప్రపంచస్థాయి వసతులతో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీకి భారీగా నిధులు అవసరం కావడంతో ఈ బడ్జెట్‌లో దానికి ఒక ప్రత్యేక పద్దును సృష్టించనున్నారు. అత్యంత కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ, నిర్మాణ వ్యయంలో రాష్ట్ర వాటా కింద చెల్లించాల్సిన నిధులను ఈ బడ్జెట్‌లో స్పష్టంగా కేటాయించనున్నారు.
నగర ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రేడియల్ రోడ్ల అనుసంధానం, ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణం, మెట్రో రెండో దశ విస్తరణ పనులకు బడ్జెట్ అండ పుష్కలంగా లభించనున్నది. పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీల్లో మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు సైతం నిధులు పెంచనున్నట్టు తెలుస్తున్నది. పారిశ్రామిక ప్రగతికి అత్యంత అవసరమైన ఎనర్జీ రంగంలో మౌలిక మార్పులు తెచ్చేందుకు, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి ఈసారి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించనున్నారు.
సౌర, పవన విద్యుత్‌లాంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. పట్టణాలకు దీటుగా గ్రామీణ రహదారుల విస్తరణ చేపట్టి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖకు సైతం నిధుల పెంపు ఉండబోతున్నది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే మల్టీ నేషనల్ కంపెనీలకు మౌలిక సదుపాయాల కొరత లేకుండా చూడటమే ఈ భారీ కేటాయింపుల ప్రధాన ఉద్దేశమని తెలుస్తున్నది.
