కరోనా కంటే దరిద్రమైనది కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీకి కుక్క చావు తప్పదు

కరోనా కంటే దరిద్రమైనది కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీకి కుక్క చావు తప్పదు

కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోవడం కాంగ్రెస్ త‌దిత‌ర పార్టీలకు ఇష్టం లేదని, కాంగ్రెస్ నేతలు అజ్ఞానం, మూర్ఖత్వంతో మాడ్లాడుతున్నారని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాదవ్ , రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఎంపీ పి .రాములు తో క‌ల‌సి ఆయ‌న ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ…గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ తదితర పార్టీల తీరు మూర్ఖత్వానికి పరాకాష్ట గా మారింద‌ని, ఉత్తమ్ తాజా వ్యాఖ్యలు ఆయన బానిస మనస్తత్వానికి నిదర్శనమ‌న్నారు. తెలంగాణ రాష్ట్రం రావడం ఉత్తమ్ లాంటి వారికి ఇష్టం లేదని ,తెలంగాణ వచ్చి తమ అధికారం పోయిందనే భావన వారిలో ఉందన్నారు.

సెక్షన్ 8 పెట్టాల‌న‌డం కాంగ్రెస్ నేత‌ల అజ్ఞానం

కాంగ్రెస్ నేత‌లు హైదరాబాద్ లో సెక్షన్ 8 పెట్టాలనే అజ్ఞానపు డిమాండ్ చేస్తున్నారన్న జ‌‌గదీశ్ రెడ్డి… రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఉన్నపుడు సెక్షన్ 8 ప్రస్తావన అర్థరహితమ‌న్నారు. ప్రగతి భవన్ కడితే ఏడ్చారు.. ఇపుడు సచివాలయం కడుతుంటే ఏడుస్తున్నారు …సచివాలయం కడితే ఎందుకు ఏడుపు ? అని అన్నారు. సచివాలయం కడుతామని త‌మ‌ మేనిఫెస్టో లోనే చెప్పామ‌న్నారు. కాంగ్రెస్ లాంటి దరిద్రపు ప్రతిపక్షం దేశంలోనే లేదు. కరోనా కంటే దరిద్రమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ . కాంగ్రెస్ తన తీరు మార్చుకోకుంటే తెలంగాణ ప్రజల చేతిలో ఆ పార్టీకి కుక్క చావు తప్పదు అని అన్నారు.

కేసీఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

కరోనా సమయంలోనూ ప్ర‌భుత్వ‌ సంక్షేమ ప‌థ‌కాలు ఆగడం లేదని, నూత‌న సచివాలయ నిర్మాణం కూడా ఆగదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్ర‌తిప‌క్షాలు కేసీఆర్ కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమ‌ని అన్నారు. కొత్త సచివాలయాన్ని కూల్చి వేస్తామని అంటే చూస్తూ ఊరుకుంటామా? అని అన్నారు. బీజేపీ దిక్కు మాలిన రాజకీయాలు చేస్తోందని, మ‌త రాజకీయాలు తప్ప ఆ పార్టీకి ఇంకేం చేత కాదని అన్నారు.

సచివాలయ నిర్మాణం పై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సెక్షన్ 8 పై ప్రతి పక్షాలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాయ‌న్నారు. ఎన్ని పెడ బొబ్బలు పెట్టినా కాళేశ్వరం కట్టి చూపించామ‌ని, అదేవిధంగా కొత్త సచివాలయం కూడా కట్టి తీరుతామ‌న్నారు.