ఉద్రిక్తతకు దారితీసిన మంత్రుల పర్యటన

ఉద్రిక్తతకు దారితీసిన మంత్రుల పర్యటన

ట్రిపుల్ ఆర్​బాధితుల అరెస్టు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, గుంటకండ్ల జగదీశ్​రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ట్రిపుల్ ఆర్ ​కారణంగా భూములు కోల్పోనున్న బాధితుల్లో యాక్టివ్​గా ఉన్నవారిని ముందస్తుగా అరెస్ట్​ చేశారు.  కాంగ్రెస్​ లీడర్ ​తంగెళ్లపల్లి రవికుమార్​ను హౌస్​అరెస్ట్​ చేయడంతో పాటు మంత్రులను కలవడానికి వచ్చిన రైతులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ భువనగిరి రూరల్​ పోలీస్ స్టేషన్​ కు తరలించారు. దీంతో పోలీస్​స్టేషన్​ కిక్కిరిసిపోయింది. 

మంత్రులను కలవబోతే..

గురువారం యాదాద్రి జిల్లా భువనగిరికి వచ్చిన మంత్రులు గుంటకండ్ల జగదీశ్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డిని కలవడానికి రైతులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఫారెస్ట్​బిల్డింగ్​వద్దకు వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్​చేశారు. అనుమతి లేనప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చారంటూ వారిని ప్రశ్నించారు. కొందరు మహిళా రైతులు ఆటోలో రాగా పోలీసులు చుట్టుముట్టి కిందికి కూడా దిగనీయలేదు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికి వారిని భువనగిరి రూరల్​ పోలీస్ స్టేషన్​కు తరలించారు. అరెస్టుల విషయం తెలుసుకున్న యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​రెడ్డి పోలీస్​స్టేషన్​కు వచ్చి వారిని పరామర్శించారు. మంత్రులు వెళ్లిపోయిన తర్వాత వదిలేశారు.  

అందరూ రోడ్డు కావాలంటే.. మీరొద్దంటున్నారేంది? 

అందరూ రోడ్లు కావాలంటుంటే మీరు వద్దంటున్నారేంది అని తనను కలిసిన రాయపర్తి రైతులతో మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి అన్నారు. బాధితుల నుంచి ఐదుగురిని పిలిపించుకున్న మంత్రి జగదీశ్​రెడ్డి వారితో మాట్లాడారు. తాము ఇప్పటికే నాలుగుసార్లు భూములను కోల్పోయామని, ఇప్పుడు ట్రిపుల్​ఆర్​కారణంగా ఉన్న భూమి మొత్తం కోల్పోతున్నామన్నారు.