- సేవా దృక్పథం ఉన్న వైద్యులు రాజకీయాల్లోకి రావాలి
- టీపీసీసీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర కమిటీ, జిల్లా చైర్మన్లు, సలహాదారుల లిస్ట్
- విడుదల చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- గౌరవ సలహాదారుగా దామోదర, సలహాదారుగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి
- హెల్త్ క్యాంపులు నిర్వహిస్తాం: రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎం. రాజీవ్
హైదరాబాద్, వెలుగు: చదువుకున్న యువత, సేవా దృక్పథం కలిగిన వైద్య నిపుణులు రాజకీయాల్లోకి రావాలని టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. టీపీసీసీ డాక్టర్స్ సెల్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లా చైర్మన్లు, సలహాదారుల లిస్ట్ ను శనివారం టీపీపీసీ చీఫ్ విడుదల చేశారు. సలహాదారుల లిస్టులో డాక్టర్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా చోటుకల్పించారు.
గౌరవ సలహాదారుగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, సలహాదారులగా కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని టీపీసీసీ నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం కోసం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి పేదవాడికీ నాణ్యమైన చికిత్స అందేలా చూడటం కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎం. రాజీవ్ మాట్లాడుతూ కొత్త కమిటీల నియామకంతో ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ క్యాంపులు, అవగాహన సదస్సులు, అత్యవసర వైద్య సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని ఏకం చేసి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించేలా టీపీసీసీ మెడికల్ విభాగాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
