- నిర్మలా సీతారామన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అడ్డుకుంటం
- ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరిక
- తన అనర్హత వేటు అంశాన్ని స్పీకర్నే అడగాలని వ్యాఖ్య
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నారని విమర్శించారు. బుధవారంఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడ అడ్డగోలుగా నిధులు కేటాయిస్తున్నారని ఫైరయ్యారు.
తెలంగాణ నుంచి పన్నుల రూపంలో నిధులు తీసుకుంటున్నారని, కానీ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం లేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం... బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన వైఖరి మార్చుకోవాలని... ఆమె హైదరాబాద్ పర్యటనకు ఎప్పుడు వచ్చినా అడ్డుకొని తమ నిరసన సెగ చూపిస్తామని హెచ్చరించారు. తన అనర్హత వేటు కేసు అంశాన్ని ప్రస్తావించగా, స్పీకర్నే అడగాలని దానం సమాధానం ఇచ్చారు
