హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు క్లీన్ చిట్ లభించింది. ఆయనపై బీఆర్ఎస్, బీజేపీ దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. ఈ సందర్భంగా దానం మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాను కానీ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.
శాసనసభలో బీఆర్ఎస్ నుంచి ఎలాంటి విప్ జారీ కాలేదని.. పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ పని చేయలేదని వివరణ ఇచ్చారు. నేను యుద్ధ రంగం నుంచి వచ్చిన వాడినని.. ఒకవేళ నాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచేవాడినని అన్నారు. తాను ఖైరతాబాద్ ప్రజల సైనికుడినని పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే:
ముఖ్యమంత్రి కాలేదని కేసీఆర్‌కి ఇబ్బంది లేదని.. కానీ కేటీఆర్ చాలా బాధ పడుతున్నారని దానం విమర్శించారు. నాతో బీజేపీకి ఏం సంబంధం..? నాపై బీజేపీ ఎందుకు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిందని ప్రశ్నించాడు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ అపవిత్ర కలయికేనని ఆరోపించారు. నేను ఎంపీగా గెలిచి ఉంటే అసలు ఈ పంచాయతీ లేకపోయేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తిగత స్వార్థం కోసం సీఎంపై విమర్శలు:
వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం కోసం బీఆర్ఎస్, బీజేపీ నేతలు ముఖ్యమంత్రిపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి తమ ఆస్తి అని కొందరు అనుకుంటున్నారని.. రేవంత్ ముఖ్యమంత్రి కావడం ఏంటని కొందరు మదనపడుతున్నారన్నారు. ఎంత డీ మోరల్ చేసిన సీఎం డీ మోరల్ కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఆశించినట్టే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఉంటాయన్నారు.
