
ఖమ్మం : ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్ కు నిరసన సెగ తగిలింది. ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రల గ్రామంలో ఈ ఉదయం ఎమ్మెల్యే హరిప్రియ పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. టీఆర్ఎస్ పార్టీలో ఇటీవల చేరారు. దీనిపై సీరియస్ గా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు.. ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే హరిప్రియ పార్టీ మారడంపై అసహనంతో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు… ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ హెచ్చరించారు. అక్కడ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపైకి మరొకరు రాళ్లు విసురుకున్నారు. పోలీసులు కూడా కొద్దిసేపు ఏం చేయలేకపోయారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో… పోలీసులు భారీగా చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు పంపించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు.