- భగీరథ్‌పై రేప్ కేసు పెట్టి నాలుగు రోజులైనా అరెస్ట్ చేయట్లే..
- ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో రూ.500 కోట్లు, హ్యామ్ రోడ్లలో రూ.5 వేల కోట్ల స్కాం
- సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
వరంగల్/నర్సంపేట, వెలుగు : ‘కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్‌ను కాపాడేందుకే సీఎం రేవంత్‌రెడ్డి సిట్ వేశారు, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు’ అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల చెరువు రోడ్డులోని అశోక్‌నగర్‌లో ఇటీవల కూల్చిన ఆలయాన్ని సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, దాస్యం వినయ్ భాస్కర్, శంకర్ నాయక్‌తో కలిసి పరిశీలించారు.
ముందుగా కూల్చిన గుడివద్ద పూజలు చేశారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్ కొడుకుపై నాలుగు రోజుల కింద రేప్ కేసు నమోదైతే ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందం కారణంగానే సీఎం రేవంత్‍రెడ్డి నిందితుడికి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటికి పది సిట్లు వేశారని, అందులో ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో విచారణ చేసిన దాఖలాలు లేవన్నారు.
కేసు నుంచి జనాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బడులు, గుడులను విధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. కాకతీయులు ఖిలా వరంగల్ నిర్మాణానికి ముందుగా పాకాల సరస్సు ప్రాంతంలో మట్టికోట కట్టి మధ్యలో శివాలయం నిర్మించారన్నారు. ఈ తరహా ఆలయాల్లో గుప్త నిధులు ఉంటాయని తెలిసినవారే గుడిని కూల్చి విలువైన సంపద దోచుకెళ్లారని పురావస్తు శాఖ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఆలయం అనుకోకుండా జేసీబీ తాకి కూలలేదని..
వజ్రవైఢూర్యాల కోసమే 24 అడుగుల లోతు తవ్వకాలు చేపట్టారన్నారు. దీని వెనుక స్థానిక ఎమ్మెల్యేతో పాటు సీఎం రేవంత్‍రెడ్డి వరకు రాష్ట్ర స్థాయి పెద్దలు ఉన్నారని ఆరోపించారు. ఆలయ కూల్చివేత ఘటన సీఎం రేవంత్‍రెడ్డి పాత్ర లేకుంటే.. నిందితులపై ఫిర్యాదు చేసినా ఎఫ్‍ఐఆర్ ఎందుకు నమోదు చేయట్లేదని ప్రశ్నించారు. ఆలయాన్ని పునర్నిర్మించి భూములను పురావస్తుశాఖకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో రూ.500 కోట్లు లూటీ చేస్తోందని, హ్యామ్ రోడ్ల నిర్మాణంలోనూ రూ.5 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
