- రాహుల్ గాంధీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని వెల్లడి
- రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి: జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: తాను ఎవరినీ పదవులు అడుక్కునే రకం కాదని, నేనొక ఫైటర్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. "నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది విప్లవంలానే ఉంటుంది. నాడు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నన్ను ఓడించడానికి వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చారు. గతంలో నేను ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు నిద్ర లేకుండా చేశాను" అని పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హైకమాండ్ ఆరుగురికి మంత్రి పదవుల విషయంలో హామీ ఇచ్చిందని, అందులో ఐదుగురికే ఇచ్చి, ఒకరికి ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. శనివారం గాంధీ భవన్‌లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకాల విషయంలో ఎమ్మెల్యే మందుల సామెల్‌పై వచ్చిన ఆరోపణలపై అభిప్రాయాలు సేకరించేందుకు ఏఐసీసీ అబ్జర్వర్‌గా నియమితులైన జగ్గారెడ్డితో ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తాను రాహుల్ గాంధీని కలిశానని, అది మంత్రి పదవి కోసం కాదన్నారు. పార్టీకి ఎవరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో అలా వాడుకోమని చెప్పడానికేనని తెలిపారు. పార్టీ, ప్రభుత్వంలో పదవుల కేటాయింపుపై రాహుల్ గాంధీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
హైకమాండ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: జగ్గారెడ్డి
హైకమాండ్ ఇచ్చిన మాట ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు. ఈ సమావేశంలో తుంగతుర్తి అంశం ప్రధాన అజెండా కాదని, రాష్ట్ర రాజకీయాలపైనే చర్చించామని చెప్పారు. స్థానిక వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారని, స్థానిక కాంగ్రెస్ నాయకులే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారని జగ్గారెడ్డి తెలిపారు.
