ప్రజాసేవ కోసమే కబ్జా చేసిన: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

ప్రజాసేవ కోసమే కబ్జా చేసిన: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
  • మీడియా ఎదుట అంగీకరించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
  • చేర్యాల చెరువు భూమిని తన బిడ్డ మున్సిపాలిటీకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడి

చేర్యాల, వెలుగు: ప్రజాసేవ కోసమే చేర్యాల పెద్ద చెరువు మత్తడి భూమిని తను కబ్జా చేసినట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అంగీకరించారు. ఆ స్థలాన్ని తన బిడ్డ తిరిగి మున్సిపాలిటీకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఆడబిడ్డను అడ్డుపెట్టుకు రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి కూడా తను అక్రమంగా అమ్ముకున్న 20 వేల గజాల భూమిని మున్సిపాలిటీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం చేర్యాల పెద్ద చెరువు కట్టవద్ద కాలువ నిర్మాణ పనులను ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరిశీలించారు. తర్వాత అక్కడే మడేలయ్య గుడి వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవ కోసమే తను చెరువు శిఖం భూమి కబ్జా చేశానని తెలిపారు. 

దాన్ని సేఫ్ చేయడానికి తను రాద్ధాంతం చేస్తున్నాననే విషయాన్ని ఖండించారు. 1270 గజాల మత్తడి స్థలం గురించి తనను విమర్శిస్తున్న ప్రతాప్​రెడ్డి ఎంతో మంది పేదల భూములను ఆక్రమించారని ఆరోపించారు. గతంలో 33 ఎకరాల వెంచర్ చేసి మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన 10 శాతం భూమిని సైతం అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయన తన బిడ్డ బూట్లు తుడవడానికి కూడా పనికిరారని విమర్శించారు. తన బిడ్డ లాగా చేర్యాల మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన 20వేల గజాల స్థలాన్ని వెనక్కి ఇచ్చి నిజాయితీ చాటుకోవాలన్నారు.

వారంలో కాలువ డిజైన్​చేసి చూపించాలె

ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రతాప్ రెడ్డి.. చేర్యాల పట్టణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాలువ డిజైన్ ఎలా ఉండాలో ప్రజాసభలో నిర్ణయిస్తే స్వీకరిస్తామని ముత్తిరెడ్డి తెలిపారు. వారంలోగా డిజైన్ చేయకపోతే ఆయన్ను చేతగాని వ్యక్తిగా గుర్తిస్తామన్నారు. ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ వెంట ఉన్నానని.. తన గురించి ఆయనకు అన్నీ తెలుసని చెప్పారు. మడేలయ్య గుడి అభివృద్దికి రూ. 20 లక్షలు తన నిధుల నుంచి మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ ఎ.స్వరూపరాణి, మార్కెట్ యార్డ్​చైర్మన్ ఎస్.మల్లేశం గౌడ్ తదితరులు ఉన్నారు.

మా భూముల్లోంచి కాలువ తీయొద్దు: దళిత మహిళలు

ఈ సందర్భంగా మా భూముల గుండా కాలువ తీయొద్దని, ఉన్నది కొద్దిపాటి వ్యవసాయ భూమి అని అది కాస్త పోతే మేము ఎలా బతకాలె అంటూ దళిత మహిళలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఎలాంటి నష్టం జరుగకుండా చూస్తానని.. కాలువ నిర్మాణం మున్సిపాలిటీ చూసుకుంటుందని ఎమ్మెల్యే వారికి జవాబు ఇచ్చారు.