కరీంనగర్, వెలుగు: కులాలు, మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం కేంద్ర మంత్రి బండి సంజయ్ ధోరణిగా మారిందని కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కోఆర్డినేటర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించాలన్నారు. స్మార్ట్ సిటీ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా సగం ఉన్నప్పటికీ, మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చినట్లు సంజయ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూకబ్జాలకు పాల్పడిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు జైలుకు వెళ్లారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు అక్రమ నిర్మాణాలు చేస్తూ నోటీసులు ఇవ్వొద్దంటూ ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. కరీంనగర్‌లో గుట్టలు మాయమయ్యాయని, ఆర్టీసీ స్థలాలను లీజు పేరుతో దశాబ్దాలపాటు కబ్జా చేశారని ఆరోపించారు.
డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఇప్పుడు బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ ప్రజలు గతంలో ఎంపీగా బీజేపీకి, ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారని, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
