
బషీర్ బాగ్, వెలుగు: నీట్ పేపర్ లీక్పై ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్యపు వైఖరిని, నీట్ విద్యార్థుల సమస్యలపై ఇప్పటి వరకు మాట్లాడని తెలంగాణ బీజేపీ ఎంపీల తీరును నిరసిస్తూ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ ఎంపీల ఇండ్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు.
నీట్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో రూపొందించిన భారీ కటౌట్ ను హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ ముందు విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులతో కలిసి వెంకట్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన ప్రధాని మోదీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాక పోతే నీట్ కౌన్సెలింగ్ రోజు భారత్ బంద్ చేస్తామని వెంకట్ హెచ్చరించారు.