హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఫస్ట్ లోపు కొత్త పీఆర్సీ ప్రకటించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి హెచ్చరించారు. పీఆర్సీ అమలును మూడేళ్లుగా పెండింగ్‌లో పెట్టి టీచర్లను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ రాష్ట్ర కార్యాలయంలో టీటీజేఏసీ చైర్మన్ పుల్లం దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
టీచర్లకు రావాల్సిన 6 డీఏలను ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ను వెంటనే గాడిలో పెట్టాలని, ఆగస్టు1 నాటికల్లా రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
