- ఫీజుల నియంత్రణ, ఉచిత విద్య కోసం త్వరలో ధర్నా
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
పంజాగుట్ట, వెలుగు: రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా అండగా ఉంటామని, ఫీజుల నియంత్రణ, ఉచిత విద్య అమలు కోరుతూ ఏప్రిల్ 26న ఇందిరా పార్క్ వద్ద భారీ ఆందోళన చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎంబీటీ అధ్యక్షుడు అహ్మదుల్లాఖాన్, టీఆర్పీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు రాజకీయాలను శాసిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయన్నారు.
మరోవైపు జనాభాలో తగిన ప్రాతినిధ్యం ఉన్న ముస్లిం మహిళలు, బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కడం లేదన్నారు. ‘మేమెంతో మాకంత’ నినాదంతో బీసీ, ముస్లిం వర్గాల ఐక్యతతో కొత్త పోరాటానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల ఆందోళనలకు తమ పూర్తి మద్దతును మల్లన్న ప్రకటించారు. అరెస్ట్ చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

