- ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: పర్మినెంట్ అయినా, అవుట్‌సోర్సింగ్ అయినా సిబ్బంది ఎవ్వరికీ ఎఫ్ఆర్ఎస్ బయోమెట్రిక్ అటెండెన్స్ నుంచి మినహాయింపు లేదని, అటెండెన్స్ లేని వారికి వేతనాలు చెల్లించవద్దని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తార్నాకలోని ఎంఎంసీ హెడ్ ఆఫీసులో ఉప్పల్, బోడుప్పల్, ఘట్‌కేసర్ సర్కిళ్ల శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ఉప్పల్‌లో 40 మంది, బోడుప్పల్‌లో13 మంది, ఘట్‌కేసర్‌లో110 మంది కార్మికులకు ఎఫ్ఆర్ఎస్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనిచేసే వారి కంటే పర్యవేక్షించే వారే ఎక్కువయ్యారని మండిపడ్డారు. అవసరానికి మించి సూపర్‌వైజర్లు, ఇన్‌చార్జీలను నియమించవద్దని, శానిటరీ వర్కర్లను పారిశుధ్య పనులకు మాత్రమే వినియోగించాలన్నారు. పనితీరు బాగాలేని శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను సాధారణ కార్మికులుగా మార్చి, బాగా పనిచేసే కార్మికులకు ఆ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.
రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండొద్దు
హయత్‌నగర్ బంజారా కాలనీ, రాఘవేంద్ర హోటల్ పరిసరాలు, హైకోర్టు కాలనీ, కప్పల చెరువు, యశోదా ఎన్‌క్లేవ్, హరిహరపురం, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో అధికారులు, సిబ్బందితో కలిసి గురువారం ఎంఎంసీ కమిషనర్ పర్యటించారు. పలు చోట్ల రోడ్లపై వర్షపునీరు నిల్వ ఉంటుందని తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాఘవేంద్ర హోటల్ ప్రాంతంలో డ్రైనేజీల డీసిల్టింగ్ పనులను స్పీడప్ చేయాలన్నారు. అనంతరం హైడ్రా అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బందితో అత్యవసర పరిస్థితులపై సమీక్షించారు.
