- ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ రికార్డు
- పైసా ఖర్చు లేకుండా పేదలకు కార్పొరేట్ వైద్యం
- గర్భాశయ, కిడ్నీ, పేగు క్యాన్సర్లకు సక్సెస్ ఫుల్‌గా సర్జరీలు
హైదరాబాద్, వెలుగు: రోబోటిక్ సర్జరీల్లో హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ రికార్డు సృష్టించింది. కేవలం 30 నెలల్లో 250కి పైగా సర్జరీలు చేసి, పలువురికి ప్రాణదానం చేసింది. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీతో వైద్యం అందిస్తున్నది. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలంటే రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చ అవుతుండగా, ఎంఎన్‌జే హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.
ఎంఎన్‌జే హాస్పిటల్‌లో సుమారు రెండున్నరేండ్ల క్రితం రూ.35 కోట్లతో ఎస్ఎస్ఐ మంత్ర అనే అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్లు ఏకంగా 250 మందికి పైగా రోగులకు ఈ విధానంలో ఆపరేషన్లు చేశారు.
ఇందులో గర్భాశయ క్యాన్సర్, ప్రొస్టేట్, కిడ్నీ, అన్నవాహిక, పెద్ద పేగు క్యాన్సర్లతో పాటు గొంతు క్యాన్సర్లకు కూడా చికిత్స అందించారు. ఒక ప్రభుత్వ హాస్పిటల్‌లో ఇంత తక్కువ సమయంలో ఇన్ని రోబోటిక్ సర్జరీలు చేయడం సాధారణ విషయం కాదని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జోసెఫ్ బెంజమిన్ తెలిపారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో ఉచితంగా రోబోటిక్ సేవలు అందిస్తున్న అతికొద్ది హాస్పిటల్స్‌లో ఎంఎన్‌జే ఒకటిగా నిలిచిందని చెప్పారు.
రోబోటిక్ సర్జరీతో లాభాలెన్నో...
సాధారణ సర్జరీలతో పోలిస్తే రోబోటిక్ సర్జరీతో పేషెంట్లకు చాలా లాభాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలోకి క్లిష్టమైన భాగాల్లో కూడా రోబో చేతులు 360 డిగ్రీల్లో సులువుగా వెళ్లి ఆపరేషన్ చేస్తాయని, పెద్దగా కోతలు ఉండవని, రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుందని, నొప్పి కూడా ఎక్కువగా ఉండదని చెబుతున్నారు. రోబొటిక్ సర్జరీల ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే చాన్స్ కూడా తక్కువగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఆపరేషన్ జరిగిన రెండు, మూడ్రోజుల్లోనే పేషెంట్ కోలుకుని ఇంటికి వెళ్లిపోవచ్చని హాస్పిటల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
