
ఎల్కతుర్తి, వెలుగు: ప్రజాస్వామ్య గొంతును కేంద్రం నొక్కేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ వేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగ్యాన్ని తుంగలో తొక్కిందని, కవులు, కళాకారులు, రచయితలు, విద్యావేత్తలను అణిచివేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పదో మహాసభను మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరై ఆయన ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. జాతీయవాదం పేరుతో హిందుత్వ ఏజెండాను మోస్తున్నదని, ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులపై విషం కక్కుతున్నదని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పేదలు వేసుకున్న గుడిసెలకు ఇండ్ల స్థలాలు, పక్కా ఇండ్లు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా సమితి సభ్యులు కామెర వెంకటరమణ, మర్రి శ్రీనివాస్, మరిపెళ్లి తిరుమల అధ్యక్షతన జరిగిన ప్రజా నాట్యమండలి కళాకారులు పాటలు పాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, ఆదరి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మండల కార్యదర్శి ఉట్కూరి రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, శనిగరపు రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.