బెంగాల్​లో పంచాయతీ హింసపై ఒక్కరూ మాట్లాడరేం? : మోదీ

బెంగాల్​లో పంచాయతీ హింసపై ఒక్కరూ మాట్లాడరేం? : మోదీ

న్యూఢిల్లీ/పోర్ట్ బ్లెయిర్:  ప్రతిపక్ష పార్టీలకు దేశం అవసరంలేదని, కుటుంబం కోసం అవినీతికి పాల్పడటం ఒక్కటే వాటి ఎజెండా అని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. అవినీతిని ప్రమోట్ చేసుకునేందుకే బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీలు ఒక్క వేదికపైకి చేరాయంటూ విమర్శలు గుప్పించారు. పోర్ట్ బ్లెయిర్​లోని వీర సావర్కర్ ఎయిర్ పోర్టులో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్​ను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్​గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసపై ప్రతిపక్ష పార్టీలు ఎందుకు సైలెంట్​గా ఉన్నాయని ప్రశ్నించారు. ‘‘సొంత క్యాడర్​పై దాడులు జరిగినా కాంగ్రెస్, లెఫ్ట్ నోరు విప్పలేదు. 

నాయకులు తమ స్వార్థం కోసం కార్యకర్తలను బలి చేశారు. అలాగే రాజస్థాన్​లో మహిళలకు అన్యాయం జరుగుతున్నా, ఎగ్జాం పేపర్లు లీక్ అవుతున్నా ఈ ప్రతిపక్షాల గ్యాంగ్ సైలెంట్​గా ఉండి తమ మిత్రపక్షానికి సపోర్ట్ చేశాయి. ఈ గ్రూప్​లోని వాళ్లు ఒకరి తప్పులను ఒకరు సమర్థించుకుంటారు. కరప్షన్, స్కాంలలో దొరికిపోతే బాధితులం అంటూ నాటకం షురూ చేస్తారు. దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్  మొదలుపెట్టగానే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారంటూ పెడబొబ్బలు పెడతారు. ఇలాంటి ప్రతిపక్షాలన్నింటినీ ఒకే వేదికపై చూస్తుంటే.. కట్టర్ భ్రష్టాచార్ సమ్మేళన్ (కరుడుగట్టిన అవినీతిపరుల సమావేశం)లా  ఉందంటున్నారు” అని ప్రధాని విమర్శించారు. 

ఈ గ్రూప్ లో అవినీతిపరులకే గౌరవం   

ప్రజాస్వామ్యం అంటే.. ‘ఫ్యామిలీ చేత, ఫ్యామిలీ యొక్క, ఫ్యామిలీ కోసం’ అనే మంత్రంగా ఈ కుటుంబ పార్టీలు మార్చుకున్నాయని మోదీ మండిపడ్డారు. ‘‘మీరంతా ప్రతిపక్షాలతో కూడిన ఈ ‘24 కోసం 26’ గ్యాంగ్​ను చూసే ఉంటారు. వీళ్లకు కుటుంబమే ఫస్ట్. దేశం అవసరం లేదు. అందరి మోటివేషన్ ఒక్కటే అదే కరప్షన్. ఎంత పెద్ద స్కాం చేస్తే.. గ్రూపులో అంత పైకి ఎదుగుతారు” అంటూ విమర్శించారు. అవినీతి, కుటుంబ రాజకీయాల వల్లే స్వాతంత్ర్యం తర్వాత దేశం అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదన్నారు. ఈ దురవస్థకు కారణమైన వాళ్లే ఇప్పుడు మళ్లీ కులతత్వం, అవినీతి దుకాణాలను తెరిచారన్నారు. రూ. 20 లక్షల కోట్ల స్కాం గ్యారంటీ అనేదే వీళ్ల ప్రొడక్ట్ అని అన్నారు. ‘‘ఈ దుకాణాల్లో అవినీతిపరులకే ప్రవేశం, ప్రాధాన్యం, స్కాంలు చేసినోళ్లకే గౌరవం ఉంటుంది. ఫ్యామిలీ అంతా అవినీతి కేసుల్లో బెయిల్ పై ఉన్న వాళ్లకు మరింత రెస్పెక్ట్ లభిస్తుంది’’ అని ఆయన ఎద్దేవా చేశారు. డీఎంకేపై తమిళనాడులో కరప్షన్ కేసులు ఉన్నా ప్రతిపక్ష పార్టీలు క్లీన్ చిట్ ఇచ్చాయన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం, అవినీతిని  పెంచుకోవడమే వీటి ధ్యేయమన్నారు. అందుకే 2024లో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్నే తీసుకురావాలని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు.

అండమాన్​లో టూరిజం మరింత పెరుగుతది 

అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్​లో 2014 నుంచి చేపట్టిన అభివృద్ధి పనుల కారణంగా టూరిస్టుల సంఖ్య రెట్టింపు అయిందని ప్రధాని మోదీ చెప్పారు. రాబోయే రోజుల్లో ఇక్కడ టూరిజం మరింతగా పెరుగుతుందన్నారు. గత 9 ఏండ్లలో అండమాన్ కు రూ. 48 వేల కోట్ల నిధులను ఖర్చు చేశామని, గత ప్రభుత్వం కన్నా ఇది రెట్టింపు అని అన్నారు. వీర సావర్కర్ ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ 11 వేల ప్యాసింజర్లను హ్యాండిల్ చేయగలదని, ఒకే సమయంలో 10 విమానాలను పార్క్ చేయొచ్చన్నారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరడాని కన్నా ముందే అండమాన్ లో నేతాజీ జెండాను ఎగరేశారని మోదీ గుర్తు చేశారు. అందుకే ఇక్కడి బానిసత్వపు ఆనవాళ్లను చెరిపేసేందుకు గాను రోస్ ఐల్యాండ్స్ కు నేతాజీ పేరును పెట్టామన్నారు. కాగా, స్థానిక పర్యావరణాన్ని సూచించేలా ఈ ఎయిర్ పోర్టును ముత్యపుచిప్ప షెల్స్ ఆకారంలో నిర్మించారు.