3న పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ బహిరంగ సభ.. 

3న పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ బహిరంగ సభ.. 
  • నియోజకవర్గాలకు చేరుకున్న జాతీయ నేతలు.. నేడు నడ్డా, రేపు మోడీ రాక
  • హైదరాబాద్ వేదికగా రేపు, ఎల్లుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 
  • ఎల్లుండి పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి.. భారీ భద్రత

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ముస్తాబైంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి చేరుకొని తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, శనివారం ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు రానున్నారు. శనివారం, ఆదివారం కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. . ఆదివారం సాయంత్ర పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరవుతారు. బీజేపీ అగ్ర నేతలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్యవర్గ సమావేశాలకు వస్తున్నందున రాష్ట్ర బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.

రెండు రోజుల ముందుగానే..
సమావేశాలకు రెండు రోజుల ముందే రాష్ట్రానికి పలువురు జాతీయ నేతలు చేరుకున్నారు. గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన నేతలు.. నేరుగా వారికి కేటాయించిన అసెంబ్లీ నియోజకర్గాలకు వెళ్లారు. కొందరు నేతలైతే బుధవరరాం రాత్రే హైదరాబాద్ చేరుకొని.. నియోజకవర్గాలకు వెళ్లారు. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలతో బిజీ అయ్యారు. వీరిలో కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్  రంగారెడ్డి జిల్లాలో, కృపాలాల్ గుర్జార్ వేములవాడలో, ఫగన్ సింగ్ కులాస్తే నిజామాబాద్ రూరల్​లో,  గిరిరాజ్ సింగ్ రాజేంద్ర నగర్ లో, పురుషోత్తం రూపాల సికింద్రాబాద్​లో, మహేంద్ర నాథ్ పాండే హుజూరాబాద్​లో,  శ్రీపాద్ నాయక్ ధర్మపురిలో,  అన్నపూర్ణ దేవి  మంచిర్యాలలో పర్యటిస్తున్నారు.  కేంద్ర మాజీ మంత్రులు ప్రకాశ్  జవదేకర్ ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడలో,  రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ భైంసాలో, రాజీవ్ ప్రతాప్ రూడీ నారాయణఖేడ్​లో పర్యటిస్తున్నారు. బాబులాల్ మారండీ (జార్ఖండ్ మాజీ సీఎం) మహబూబాబాద్ లో,  బిప్లవ్ కుమార్ ( త్రిపుర మాజీ సీఎం ) ఆదిలాబాద్ లో పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్రాల బీజేపీ ఎంపీలు జయంత్ కుమార్ రాయ్  మానకొండూర్​లో, దేబాశ్రీ చౌదరి హుస్నాబాద్​లో, గోపాల్ జీ ఠాకూర్  గోదావరిఖనిలో, దిపిస్ సోండెల్  కొమురంభీం జిల్లాలో, అప్రజితా సారంగి సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ లో,  మనోజ్ తివారీ జగిత్యాలలో, భారతీ శీయల్  ఎల్లారెడ్డిలో, దీపక్ ప్రకాశ్  గజ్వేల్ లో , నంద కిశోర్  నిర్మల్​లో పర్యటిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ డిప్యూటీ సీఎం కావిందర్ గుప్తా బెల్లంపల్లిలో, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య హైదరాబాద్ లో కార్యకర్తల సమావేశాల్లో  పాల్గొంటున్నారు. వీరే కాకుండా వివిధ రాష్ట్రాల ​బీజేపీ అధ్యక్షులు, జాతీయ ఆఫీసు బేరర్లు, జాతీయ అధికార ప్రతినిధులు, పలు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. గురు, శుక్ర వారాల్లో వీరు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి శనివారం ఉదయం  నేరుగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. ఈ రెండు రోజుల పాటు బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టనున్నారు. వచ్చే నెల 3 న హైదరాబాద్ లో  జరుగనున్న మోడీ సభకు జనసమీకరణపై స్థానిక బీజేపీ నేతలతో చర్చించనున్నారు. శక్తి కేంద్రాల ఇన్​చార్జులతో  సమావేశాలు, మండల పార్టీ అధ్యక్షులతో భేటీలు, ఆర్ఎస్ఎస్ ఇతర హిందూ సంస్థల ముఖ్య నాయకులతో ములాఖత్ లు జరుపనున్నారు. 

గ్రాండ్​ వెల్​కమ్ పలికేందుకు ఏర్పాట్లు..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒక రోజు ముందుగానే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి కిలో  మీటర్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హెచ్ఐసీసీ నోవాటెల్ కు నడ్డా చేరుకొని సాయంత్రం 6 గంటలకు ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. రాత్రి 7 గంటలకు అక్కడే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్న రాజకీయ,  ఆర్థిక అంశాలపై నడ్డా వీరితో చర్చించనున్నారు. అక్కడ రాత్రి 8.30 గంటలకు భరతనాట్యం, శివతాండవం, పేరణి నృత్యం వంటి  సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత దరువు ఎల్లన్న నేతృత్వంలోని తెలంగాణ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి.  శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ నేషనల్ ఆఫీసు బేరర్ల సమావేశం నడ్డా అధ్యక్షతన జరుగనుంది. 

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోడీ.. అక్కడి నుంచి హెలికాప్టర్ లో నోవాటెల్ కు చేరుకుంటారు. అదే రోజున అమిత్ షా, ఇతర ముఖ్య నేతలు హైదరాబాద్ కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సమావేశాల్లో పాల్గొంటారు. నోవాటెల్ లోనే కేటాయించిన ప్రత్యేక సూట్లలో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం సమావేశాల్లో పాల్గొననున్న మోడీ.. సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభకు హాజరవుతారు. 

ప్రధాని మోడీ రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఉంటున్నందున ఆయన సిటీలో  ఏదో ఒక ప్రాంతానికి వెళ్లొచ్చని, పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లే అవకాశం కూడా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. మోడీ సర్​ప్రైజ్​ విజిట్​ ఏది అనేది పార్టీలో ఆసక్తి నెలకొంది. 

బహిరంగ సభతో సత్తా చాటాలని..!
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చాటి చెప్పేందుకు, కేసీఆర్​ అవినీతిని ఎండగట్టేందుకు పరేడ్​ గ్రౌండ్​లో ప్రధాని మోడీ సభను నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో గెలుపు బీజేపీదేననే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేందుకు ఈ సభ ఉపయోగపడుతుందంటున్నారు. సభను సక్సెస్​ చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సుమారు 10 లక్షల మందిని తరలించాలని 
భావిస్తున్నారు. 

ప్రాంగణాలకు తెలంగాణ యోధుల పేర్లు..
నోవాటెల్​లోని పలు ప్రదేశాలకు రాష్ట్రంలోని పలు చారిత్రాత్మక ప్రాంతాలు, తెలంగాణ యోధుల పేర్లను రాష్ట్ర పార్టీ నాయకత్వం పెట్టింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నోవాటెల్  ప్రాంగణానికి శాతవాహన నగర్ గా,  జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హాల్​కు కాకతీయ ప్రాంగణంగా, అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క-సారలమ్మ నిలయంగా పేర్లు పెట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శుల మీటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వందేమాతరం రామచంద్రరావు పేరు, మీడియా పాయింట్​కు షోయా బుల్లాఖాన్ పేరు, జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసు పేరు, బీజేపీ ఫుల్ టైమర్  వర్కర్స్ సమావేశానికి కొమురం భీం పేరు, భోజనశాలకు భాగ్యరెడ్డి వర్మ పేరు, జాతీయ కార్యవర్గ సమావేశాల తీర్మానాల ప్రాంగణానికి నారాయణ పవార్ పేరును పెట్టారు.

అతిథులకు సకినాలు, గారెలు..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే అతిథులకు తెలంగాణ సాంప్రదాయ వంటకాలను రుచి చూపించాలని పార్టీ నిర్ణయించింది. సకినాలు, గారెలు, అరిసెలు, సర్వపిండి వంటి వంటకాలను మెనూలో చేర్చింది. నోవాటెల్ చెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతోగాకుండా, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన యాదమ్మతో ఈ వంటకాలు చేయిస్తోంది. మూడో తేదీ మధ్యాహ్నం లంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిక్కుడుకాయ, వంకాయ, బెండకాయ, తోటకూర, బీరకాయ, గంగవాయిలి పప్పు, పప్పు చారు, బగారా వంటకాల రుచి చూపించనుంది. అదే రోజు సాయంత్రం ప్రధాని మోదీ, అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షా, నడ్డా వంటి ప్రముఖులకు సకినాలు, గారెలు, గంజు పిండి తదితర వంటలను స్నాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అందిస్తుంది. ఈ మీటింగ్​లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అతిథులు వస్తుండడంతో, అన్ని రాష్ట్రాల వంటకాలను మెనూలో ఉంచారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాత్రికి డిన్నర్ ఏమేం చేయాలో లిస్ట్ విడుదల చేశారు.

బీజేపీ ఫ్లెక్సీలకు మరో  రూ.50 వేల ఫైన్..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్లపై జీహెచ్ఎంసీ అధికారులు భారీగా జరిమానా విధిస్తున్నారు. బుధవారం రూ.3.73 లక్షల ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయగా, గురువారం మరో రూ.50 వేల ఫెనాల్టీ వేశారు. 10 బ్యానర్లు, కటౌట్లకు గాను ఒక్కోదానికి రూ.5 వేల చొప్పున జరిమానా వేశారు. శనివారం సమావేశం, ఆదివారం పరేడ్​గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ఇంకో రెండ్రోజుల పాటు సిటీలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలకు కూడా ఫైన్లు వేసే అవకాశం ఉంది.