- పుణె నుంచి రేపు రాష్ట్రానికి రానున్న టెస్టు కిట్లు
హైదరాబాద్: గాంధీ మెడికల్ కాలేజీలో మంకీపాక్స్ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. పుణె వైరాలజీ ల్యాబ్ నుంచి నుంచి రేపు రాష్ట్రానికి కిట్లు అందిన వెంటనే గాంధీలో ట్రయల్ టెస్టులు నిర్వహించనున్నారు. వైరాలజీ ల్యాబులో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తారు. బ్లడ్, స్వాబ్, స్కిన్ పై ఉన్న నీటి బుడగల నుంచి శాంపిల్స్ సేకరించి మంకీపాక్స్ సోకింది లేనిది నిర్ధారిస్తారు. రాష్ట్రంలో ఎక్కడైనా మంకీపాక్స్ అనుమానితులు కనిపిస్తే వారి నుంచి శాంపిల్స్ సేకరించి గాంధీకి తీసుకొచ్చి నిర్ధారణ చేస్తారు.
ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్ (వైరస్) ఇప్పుడు మనదేశంలోకి కూడా ప్రవేశించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై టెస్టులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేసింది. కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అవసరమైన సన్నాహాలు చేపట్టింది. ఇప్పటి వరకు సరైన ట్రీట్మెంట్ ఏదీ లేనప్పటికీ నియంత్రణ కోసం డాక్టర్లు మందులు ఇస్తున్నారు. కరోనా సమయంలో అనుసరించిన సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్), మాస్కులు ధరించడం, మెరుగైన వెంటిలేషన్ వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికాలు జారీ చేసింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలుంటే.. వారిని అప్రమత్తం చేసి శాంపిల్స్ గాంధీకి పంపి నిర్ధారించుకునేలా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.
