రాక్షస పాలన పోయి..ప్రజా పాలన వచ్చింది

రాక్షస పాలన పోయి..ప్రజా పాలన వచ్చింది
  •     కొండగట్టు అంజన్న ఆశీస్సులు రాష్ట్రంపై ఉన్నయ్: వివేక్
  •     ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నం
  •     మిషన్ భగీరథ ఫెయిల్యూర్ స్కీమ్ అని విమర్శ

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆశీస్సులతో రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలవాలని అభిమానులు ఆంజనేయ స్వామిని మొక్కుకున్నారని తెలిపారు. 

అందులో భాగంగా మొక్కు చెల్లించుకోవడానికి అభిమానులతో కలిసి కొండగట్టుకు వచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా 105 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు సమర్పించుకున్నారు. తర్వాత వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన ఉండి.. ప్రగతి భవన్ ఇనుప కంచె బద్దలు కొట్టి ప్రజలకు భరోసా కల్పించారని తెలిపారు. స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్ కింద ప్రభుత్వం రిలీజ్ చేసిన రూ.10కోట్లు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రకటించారు.

 మిషన్ భగీరథ ఫెయిల్యూర్ స్కీమ్ అని, అందుకే రాష్ట్రంలో తాగునీటి సమస్య ఏర్పడిందని విమర్శించారు. తర్వాత గుట్టపై ఉన్న కోతులకు ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.