ఏప్రిల్ 1 నుంచి మరిన్ని రైళ్లు

ఏప్రిల్ 1 నుంచి మరిన్ని రైళ్లు
  • దక్షిణ మధ్య రైల్వే జోన్లో పట్టాలెక్కనున్న 200 ట్రైన్స్

హైదరాబాద్, వెలుగు : దక్షిణ మధ్య రైల్వేలో మరిన్ని ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. పోయిన ఏడాది కరోనా కారణంగా నిలిచిన పోయిన రైళ్లు పూర్తిస్థాయిలో నడవక ప్రయాణికులు పడుతున్న కష్టాలు కొంత మేర తీరబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 200 రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి, దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో దూర ప్రయాణాలు చేసేవాళ్లకు కొంత మేర ఇబ్బందులు తీరుతాయి. అయితే సిటీలో ఏడాది గడుస్తున్నా ఇంకా ఎంఎంటీఎస్ సర్వీసులు 
ప్రారంభం కాలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు.

తీరనున్న తిప్పలు
కరోనాతో  పోయిన ఏడాది మార్చి చివరి వారంలో పూర్తిగా రైళ్లు బంద్ అయ్యాయి. అన్లాక్లో భాగంగా రైళ్లు నడిపేందుకు కేంద్రం కొన్ని ఆంక్షలతో అనుమతి ఇచ్చింది. గతేడాది జూన్ 10 నుంచి పరిమిత సంఖ్యలో స్పెషల్ రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ నుంచి కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే ట్రైన్లను రైల్వే శాఖ నడిపిస్తోంది. తెలంగాణలో రోజుకు సుమారు 100 సర్వీసులు మాత్రమే తిరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి, జోన్ మీదుగా మరికొన్ని రైళ్లు వెళ్తున్నాయి. వీటిలో చాలావరకు సికింద్రాబాద్, వరంగల్, కాజీపేట వంటి చోట్ల తప్ప అన్ని  మేజర్ స్టేషన్లలో కూడా ఆగడం లేదు. తిరుగుతున్న రూట్లలో కూడా రైళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటోంది. పైగా డైరెక్ట్గా కౌంటర్లో టికెట్ తీసుకుని ప్రయాణం చేసే వీలు కూడా లేకపోవడంతో సామాన్యులకు ఇబ్బందిగా మారింది. అయితే ఇప్పుడు సర్వీసులు పెంచుతుండడంతో ప్రయాణికుల తిప్పలు తీరబోతున్నాయి.

ఏయే రూట్లన్నది త్వరలో ప్రకటన
ప్రయాణికులు అవసరాలు, రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు దశలవారీగా ట్రైన్ సర్వీసులను పెంచుతూ వస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 200 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఏయే రూట్లలో, ఎన్ని రైళ్లు పెంచబోతున్నారన్నది త్వరలో ప్రకటించనున్నారు. ముఖ్యంగా రద్దీ ఉన్న రూట్లలో ఎక్కువగా ట్రైన్స్ అందుబాటులోకి వస్తాయి. విశాఖ– లింగంపల్లి, సికింద్రాబాద్ – తిరుపతి, సికింద్రాబాద్ – విశాఖ, విజయవాడ– సికింద్రాబాద్ రూట్లలో రైళ్లు పెరిగే అవకాశం ఉంది.