విశాఖపట్నం: విశాఖ నగరంలో ఘోరం జరిగింది. ప్రియురాలిని చంపి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో ఆమె బాడీ పార్ట్స్ దాచిన ఉన్మాది ఉదంతం నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే ఈ విశాఖ వివాహిత హత్య జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నగరంలోని గాజువాక పరిధిలోని ఎల్‌వీనగర్‌లో రవీంద్ర అనే నేవీ ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. అతనికి పెళ్లి అయింది. రవీంద్రకు నగరానికి చెందిన మౌనిక అనే 28 ఏళ్ల వివాహితతో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్యకు తెలియకుండా మౌనికతో రవీంద్ర వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే.. కొన్ని నెలల నుంచి మౌనిక తనకు కొంత డబ్బులు ఇవ్వాలని రవీంద్రపై ఒత్తిడి చేసింది. భార్యకు విషయం తెలిసిపోతుందనే భయంతో మొదట్లో రవీంద్ర కూడా మౌనికకు కొంత డబ్బు సర్దాడు. అయితే.. తనకు డబ్బు కావాలని మౌనిక ఇటీవల మళ్లీ అడగడంతో రవీంద్ర తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఇలా డబ్బుల కోసం మౌనిక అడుగుతుండటంతో రవీంద్ర ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆమె ఎక్కడ తన భార్యకు నిజం చెబుతుందోననే భయం మాత్రం రవీంద్రను వెంటాడింది.
ఈ క్రమంలోనే.. క్షణికావేశంలో రవీంద్ర ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. మౌనికను చంపేయాలని ప్లాన్ చేశాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయం చూసి.. మౌనికను రవీంద్ర ఇంటికి రమ్మని పిలిచాడు. అతని మాటలు నమ్మి ఇంటికి వెళ్లిన మౌనికను రవీంద్ర కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమెపై విపరీతమైన ద్వేషంతో రగిలిపోయి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. కొన్ని శరీర భాగాలను మూట కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు. మరికొన్ని శరీర భాగాలను ఇంట్లో ఒక పక్కన ఉంచేసి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
మౌనికను చంపేశానని, డబ్బుల కోసం వేధిస్తుండటం వల్లే హత్య చేశానని పోలీసుల ఎదుట రవీంద్ర నిజం ఒప్పుకున్నాడు. పోలీసులు రవీంద్రను అరెస్ట్ చేశారు. పోలీసులు రవీంద్ర ఇంటికి వెళ్లి పరిశీలించగా.. ఫ్రిడ్జ్లో మౌనిక శరీర భాగాలు దొరికాయి. ఇంట్లో మరో మూలన ఇంకో మూట కనిపించింది. మౌనిక తల పోలీసులకు లభ్యం కాలేదని తెలిసింది. మౌనిక తలను ఎక్కడ పడేశాడని రవీంద్రను పోలీసులు ఆరా తీస్తున్నారు.
