ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పరిధిలో మద్యం మత్తులో ఒక మనిషి మృగంలా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై పాశవికంగా కత్తితో దాడి చేశాడు. భర్త దాడిలో భార్య, కుమారుడు స్పాట్లోనే చనిపోయారు. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. చిన్న పిల్లలనే కనీస కనికరం లేకుండా ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడన్న సంగతి తెలిసి ఇరుగుపొరుగు ఉలిక్కిపడ్డారు.
మద్యం మత్తులో భార్య, పిల్లలపై భర్త కత్తితో దాడి చేయగా, భార్య కవిత, కుమారుడు ప్రణీత్ మృతి. ఆమన్‌గల్లు మండలం పులిగోనిపల్లి తండాలో ఈ ఘటన జరిగింది. నిందితుడు రాందాస్‌నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని కూతురు హర్షిత పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
2026, జనవరిలో కూడా ఇలాంటి ఘటనే సిద్ధిపేట పరిధిలో జరిగింది. అనుమానంతో ఓ వ్యక్తి భార్య, బిడ్డపై కత్తితో దాడి చేసిన అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. భార్య చనిపోయింది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో జరిగింది. దుల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానిక చెందిన దున్నపోతుల ఎల్లయ్య భార్య శ్రీలత (32), కూతురు హర్షిత, కొడుకు అజయ్‌తో కలిసి పదేండ్లు సిద్దిపేటలో ఉన్నాడు. కొన్ని నెలల కింద కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వెళ్లిన ఎల్లయ్య పది రోజుల కింద తిరిగి సిద్దిపేటకు వచ్చి ఆదర్శనగర్‌లో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుంటున్నాడు.
భార్యపై అనుమానం పెంచుకున్న ఎల్లయ్య ఆదివారం రాత్రి మద్యం మత్తులో కత్తితో భార్య శ్రీలత గొంతు కోసిన అనంతరం కూతురు హర్షిత గొంతు సైతం కోసేందుకు ప్రయత్నించడంతో ఆమె అడ్డుకుంది. దీంతో రోకలిబండతో దాడి చేశాడు. హర్షిత కేకలు విన్న అజయ్ వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. కాలనీవాసులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో భయాందోళనకు గురైన ఎల్లయ్య గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
