జగిత్యాల: మానవత్వం మంటగలిసింది. బంధాలు, అనుబంధాలు అన్నీ ఒట్టి బూటకమని మరోసారి తేలిపోయింది. జగిత్యాల హనుమాన్ వాడలో ఆస్తి కోసం దహన సంస్కారాల దగ్గర గొడవ జరిగింది. జంగిల్ మల్లయ్య అనే వృద్ధుడి అంత్యక్రియల సమయంలో జరిగిన గొడవ స్థానికంగా చర్చనీయాంశమైంది. వృద్ధుడి కొడుకు గతంలోనే చనిపోవడంతో మనవడి(కొడుకు కుమారుడు)తో తల కొరివి పెట్టించాలని గ్రామస్తులు నిర్ణయించారు.
మనవడితో తలకొరివి పెట్టనివ్వకుండా వృద్ధుని కుమార్తెలు అడ్డుకున్నారు. అంత్యక్రియల దగ్గర కోడలు, మనుమడు, మనవరాలిపై దాడి చేశారు. దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. పక్షవాతంతో బాధపడుతూ జంగిలి మల్లయ్య మృతి చెందాడు. మల్లయ్యకు ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
కరోనా సమయంలో మల్లయ్య కొడుకు చనిపోయాడు. మల్లయ్య మనుమడు మనోహర్‌కు తలకొరివి హక్కు ఉందని కుల పెద్దలు చెప్పారు. ఆస్తులు తమ పేర్లపై చేసుకున్నారని మల్లయ్య కూతుర్లపై ఆరోపణలు ఉన్నాయి. వారసత్వ వివాదంతో దహన సంస్కారాలు నిలిచిపోయాయి. పోలీసులు, కుల పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మంగళవారం ఉదయం మల్లయ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. చివరకు తాత చితికి మనుమడు మనోహర్ తలకొరివి పెట్టాడు. హనుమాన్‌వాడ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
