గంజాయి సప్లయర్​గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

గంజాయి సప్లయర్​గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

బషీర్​బాగ్, వెలుగు: మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్‌‌‌‌ రూట్ మార్చి, గంజాయి సప్లయర్ గా మారాడు. మరో నలుగురితో కలిసి గంజాయి తరలిస్తూ సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైం టీంకు పట్టుబడ్డాడు. ఫలక్‌‌నుమాకు చెందిన సయ్యద్‌‌ సయీద్‌‌ హూస్సేన్‌‌ అలియాస్ లంబా(39) చైన్ స్నాచింగ్‌‌, దారిదోపిడీలు సహా 250 కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇటీవల అబిడ్స్‌‌లోని జువెల్లరీ షాపులో జరిగిన చోరీలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జూబ్లీహిల్స్, నారాయణగూడ, మహంకాళి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో  జైలుకెళ్లాడు. 

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఇతనిపై పీడీయాక్ట్ పెండింగ్ లో ఉంది. పోలీసులకు వాంటెడ్‌‌గా ఉండడంతో రూట్​మార్చాడు. గంజాయి సప్లై చేసేందుకు స్కెచ్‌‌ వేశాడు. ఫలక్ నుమా ప్రాంతానికి చెందిన అమీర్ ఖాన్(31), ఫరూక్ ఖాన్(27),  మహమ్మద్ గౌస్(40), మహమ్మద్ అజాంఖాన్(27)తో కలిసి నాగపూర్ లో గంజాయి కొనుగోలు చేశాడు. మంగళవారం కారులో పాతబస్తీకి తరలిస్తూ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డారు. 21 కిలోల గంజాయి, కారు, సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకొని, వారిని అరెస్ట్​ చేశారు.  

ఘట్​కేసర్ : ఐదుగురు గంజాయి విక్రేతలను అరెస్ట్​చేసినట్లు రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ తెలిపారు. కర్నాటకలోని బీదర్ జిల్లా శంషేర్​పూర్​కు చెందిన గోవింద్ తపలే(34), గజానంద్(21), పవన్(25), ఆకాశ్(32), ఆదిలాబాద్ అంబేద్కర్​నగర్​కు చెందిన తారోజ్​రాహుల్(31) ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఒడిశాలోని గణపతి జిల్లాకు చెందిన సుమన్ జన్ని వద్ద కిలో గంజాయి రూ. 1,900 చొప్పున మొత్తం 58.88 కిలోలు కొనుగోలు చేసి, పుణేకు చెందిన అభిషేక్​కు రూ.5 వేల చొప్పున విక్రయించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. 

కారులో భద్రాచలం, సూర్యాపేట పంతంగి టోల్ గేట్ మీదుగా ఓఆర్​ఆర్​ నుంచి పుణే రోడ్డులో వెళ్లాలనుకున్నారు. ఎక్సైజ్ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో సోమవారం రాత్రి ఓఆర్ఆర్ ఘట్​కేసర్ ఎగ్జిట్ వద్ద వీరిని అరెస్ట్ చేశారు.  గంజాయితోపాటు, కారు, 5 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్ట్​చేసినట్లు పేర్కొన్నారు. ఒడిశాకు చెందిన సుమన్ జన్ని, పుణేకు చెందిన అభిషేక్ పరారీలో ఉన్నారు.

4 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: డ్రగ్​విక్రయించేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి ని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి రాజీవ్ నగర్ లో నివాసం ఉండే ప్రణీత్(24) ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఈ నెల 19న బెంగళూరు వెళ్లి,  ఓ వ్యక్తి వద్ద ఎండీఎంఏ డ్రగ్​కొనుగోలు చేసి, హైదరాబాద్ కు తీసుకువచ్చాడు. మంగళవారం వైజాగ్​లో అమ్మేందుకు బయలుదేరాడు. 

గచ్చిబౌలి వినాయక్ నగర్ బస్టాప్ వద్ద ప్రణీత్ వేచి ఉండగా టీజీ న్యాబ్​పోలీసులు పక్కా సమాచారంతో అతన్ని పట్టుకున్నారు. తనిఖీ చేయగా 4 గ్రాముల ఎండీఎంఏ లభించింది. అతన్ని పోలీసులకు అప్పగించగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రణీత్ గతంలోనూ బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి పోలీసులకు చిక్కాడు.