నాగర్ కర్నూల్ లో విషాదం.. భర్త మరణం తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

నాగర్ కర్నూల్ లో విషాదం.. భర్త మరణం తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
  •     కూతురు మృతి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కొడుకు
  •     నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో విషాదం

కల్వకుర్తి, వెలుగు: నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా కల్వకుర్తి పట్టణం తిలక్ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషం కలిపిన ఆహారం పెట్టి తల్లి ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ప్రకారం..కొట్ర గ్రామానికి చెందిన భీమశెట్టి ప్రసన్న(38), భీమశెట్టి ప్రకాశ్  దంపతులు కల్వకుర్తిలో బుక్ షాప్ నడుపుతున్నారు. 40 రోజుల కింద ప్రకాశ్ గుండెపోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి ప్రసన్న ఇద్దరు పిల్లలతో కలసి ఉంటోంది. భర్త చనిపోయిన తరువాత డిప్రెషన్​లోకి వెళ్లింది.ఈ క్రమంలో గురువారం ప్రసన్న తన ఇద్దరు పిల్లలకు ఆహారంలో విషం పెట్టి తినిపించి, తాను కూడా తిన్నది. బయట నుంచి వచ్చిన ప్రసన్న తమ్ముడు తలుపు తట్టగా ఎవరూ పలకలేదు. అప్పటికే విష ప్రభావంతో కూతురు మేఘన(13) చనిపోయింది. కొడుకు ఆశ్రిత్ రామ్(15) వచ్చి తలుపు తీశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన తల్లి, కొడుకును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రసన్న చనిపోయింది. కొడుకు ఆశ్రిత్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు బంధువులు తెలిపారు. భర్త మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రసన్న.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.