
బటర్ చికెన్ బాగుందని బటర్ నన్‌లు ఆర్డర్ చేసుకొని తినేస్తున్నారా! అయితే జాగ్రత్త. తిన్నారని మీ మీద రెస్టారెంట్ యజమానులు కోర్టుకెళ్లే అవకాశం లేకపోలేదు. అవును నిజమే..! బటర్ చికెన్ కనిపెట్టింది తామంటే తామంటూ ఇద్దరు రెస్టారెంట్ యజమానులు కోర్టు మెట్లెక్కారు.
ఇంతకీ ఈ గొడవ ఏంటంటే..?
"ఇన్వెంటర్స్ ఆఫ్ బటర్ చికెన్ అండ్ దాల్ మఖానీ" అనే ట్యాగ్‌లైన్ వాడకంపై ప్రసిద్ధ మోతీ మహల్ రెస్టారెంట్ యజమానులు.. దర్యాగంజ్ రెస్టారెంట్‌పై ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. 1950లో తమ పూర్వీకులు దివంగత చెఫ్ కుండల్ లాల్ గుజ్రాల్ బటర్ చికెన్ మరియు దాల్ మఖానీని కనిపెట్టారని, అయితే దాన్ని దర్యాగంజ్ రెస్టారెంట్ వారు తాము కనిపెట్టినట్లు చెప్పుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలా వారు ఆ ట్యాగ్‌లైన్ వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అందుకు ప్రతిగా దర్యాగంజ్ రెస్టారెంట్ యజమానులు "ఇన్వెంటర్స్ ఆఫ్ బటర్ చికెన్ మరియు దాల్ మఖానీ" అనే ట్యాగ్‌లైన్‌ను మోతీ మహల్ రెస్టారెంట్ యజమానులు తప్పుగా ఉపయోగిస్తున్నారని దావా వేశారు. తమ పూర్వీకుడు లేట్ కుందన్ లాల్ జగ్గీ.. బట్టర్ చికెన్ మరియు దాల్ మఖానీ వంటకాలను కనుగొన్నారని పేర్కొంటూ మోతీ మహల్ యజమానులు ప్రజలకు ఇన్నాళ్లు తప్పుగా చూపించారని ఆరోపించారు. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో వాదోపవాదనలు మొదలయ్యాయి.