ఈ నెల 31లోపు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకుంటే ఉద్యమం 

ఈ నెల 31లోపు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకుంటే ఉద్యమం 
  • ఇందిరాపార్కు వద్ద యూఎస్​పీసీ ధర్నా

హైదరాబాద్, వెలుగు: టీచర్లు, ఉద్యోగులు, పింఛనర్లకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలివ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్​పీసీ) డిమాండ్ చేసింది. ఈనెల 31లోపు పెండింగ్ బిల్లులన్నీ రిలీజ్ చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. మంగళవారంహైదరాబాద్​లో ఇందిరాపార్కు వద్ద యూఎస్​పీసీ ఆధ్వర్యంలో టీచర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎన్నో స్కీములకు వేల కోట్లు కేటాయించే రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్​ బిల్లుల కోసం రూ.300 కోట్లు  కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

ఒకటో తారీఖే జీతాలియ్యాలె

ధనిక రాష్ట్రమని, ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇస్తున్నామని పదేపదే చెప్పుకునే పాలకులు.. ఉద్యోగులకు సంబంధించిన అనేక బిల్లులు పెండింగ్​లో ఎందుకు ఉన్నాయో చెప్పాలని డిమాండ్​ చేశారు. రెండు నెలల గత పీఆర్సీ బకాయిలను 18 వాయిదాల్లో ఇస్తామన్న ప్రభుత్వం .. 11 నెలలు గడిచినా మూడు, నాలుగు వాయిదాలకు మించి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈనెలాఖరులోగా ట్రెజరీల్లో పాసైన అన్ని బిల్లులను ఎంప్లాయీస్ ఖాతాల్లో త్వరితగతిన జమ చేసేందుకు ఆర్థికశాఖ చొరవ చూపాలని యూఎస్​పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, జంగయ్య (యూటీఎఫ్​), అశోక్​ కుమార్(టీపీటీఎఫ్​), లింగారెడ్డి(డీటీఎఫ్​) కోరారు. కార్యక్రమంలో యూఎస్​పీసీ రాష్ట్ర నాయకులు ఎం.రవీందర్, ఎంసోమయ్య, యాదగిరి, విజయకుమార్, హరికృష్ణ, కొండయ్య, నజీర్, వివిధ జిల్లాల టీచర్లు పాల్గొన్నారు.