
పండగ సందర్భంగా దుబాయ్ జుమేరా బీచ్ కు వెకేషన్ కు వెళ్లారు. ఫ్యామిలీ అంతా సరదాగా గడిపారు. ఆ క్రమంలో అక్కడ ఫేమస్ అయిన స్కూబా డైవింగ్ చేయాలని ప్రయత్నించి భారత ఇంజినీర్ మృతి చెందడం ఆ ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఇంజినీర్ ఐజాక్ పాల్ ఒలక్కెంగిల్ (29) యూఏఈలో ఇంజినీర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈద్-అల-అధా పండుగ సందర్భంగా కుటుంబంతో కలిసి సెలెబ్రేట్ చేసుకునేందుకు బీచ్ వెళ్లారు. స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో చనిపోయాడు.
స్కూబా డైవింగ్ ట్రైనింగ్ సెషన్ లో ఈ ప్రమాదం జరిగినట్లు ఐజాక్ బంధువు చెప్పారు. బిగినర్స్ ట్రైనింగ్ సెషన్ లో ఐజాగ్ పాల్గొ్న్నాడని.. అందరూ ట్రైనింగ్ పార్టిసిపేషన్ లో ఉండగా గుండె పట్టేసిందని తెలిపారు. వెంటనే ట్రైనింగ్ గ్రూప్ నుంచి బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐజాక్ మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు అధికారులతో మాట్లాడుతున్నట్లు ఐజాక్ బంధువు ప్యరిలోస్ తెలిపారు.
స్కూబా డైవింగ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ క్రీడ. బీచ్ లలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. సముద్ర అంతర్భాగంలోకి వెళ్లి నీళ్లలో ఉండే వివిధ రకాల జంతుజాతులను చూడవచ్చు. సముద్ర అంతర్భాగం గురించి ప్రత్యక్షంగా చూసి అనుభూతి పొందవచ్చు. అందుకోసమే చాలా మంది ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ చేస్తుంటారు. ఐజాక్ కూడా అలాగే తన అభిరుచిని తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ.. మృత్యువు అతని ఆనందాన్ని ఎక్కువసేపు మిగల్చలేదు.